Begin typing your search above and press return to search.

భార‌త్‌ లో త‌గ్గ‌ని క‌రోనా విజృంభ‌ణ‌: ఒక్క‌రోజులో 1,396 కేసులు

By:  Tupaki Desk   |   27 April 2020 4:56 PM GMT
భార‌త్‌ లో త‌గ్గ‌ని క‌రోనా విజృంభ‌ణ‌: ఒక్క‌రోజులో 1,396 కేసులు
X
భార‌త‌దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తూనే ఉంది. ఎక్క‌డా అదుపులోకి రావ‌డం లేదు. తాజాగా దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 1,396 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఆ వైరస్‌ బారినపడి 872 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం 6,185 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపింది. ఈ విధంగా క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో సోమ‌వారం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ముఖ్య‌మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయా రాష్ట్రాల వారీగా క‌రోనా వ్యాప్తి, క‌ట్ట‌డిపై వివ‌రాలు తెలుసుకున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్రాల స‌ల‌హాలు కూడా అడిగారు. ప్ర‌ధాన‌మంత్రి వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన రోజు కూడా క‌రోనా కేసులు భారీగా పెరిగాయి.

అయితే తాజాగా వెలుగుచూసిన కేసుల్లో మూడు రాష్ట్రాల్లోనే 68 శాతం పాజిటివ్‌ కేసులున్నాయని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కరోనా వైరస్‌ నుంచి రికవరీ రేటు 22.17 శాతం పెరిగింద‌ని, ఇది ఊరట కలిగించే విష‌య‌మ‌ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్ వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా 20,835 కేసులు చురుగ్గా (యాక్టివ్‌) ఉన్నాయని తెలిపారు. ఈ నేప‌థ్యంలో క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌన్‌ను ప‌టిష్టంగా అమ‌లు చేయాల‌ని, రాష్ట్రాలు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఇదే క్ర‌మంలో లాక్‌డౌన్ స‌మ‌యంలో రైతులకు కొన్ని సడలింపులు ఇచ్చామని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గ్రామీణ ఉపాథి హామీ పనులు గ్రామాల్లో ప్రారంభమయ్యాయని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా వ్యాప్తి ఇంకా త‌గ్గుముఖం ప‌ట్ట‌లేద‌ని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో మ‌రికొన్నాళ్ల పాటు లాక్‌డౌన్ కొన‌సాగించే అవ‌కాశం క‌నిపిస్తోంది.