Begin typing your search above and press return to search.

పంత్ కు పాజిటివ్ ఎలా? ఆ తప్పే టీమిండియా కొంప ముంచనుందా?

By:  Tupaki Desk   |   16 July 2021 4:02 AM GMT
పంత్ కు పాజిటివ్ ఎలా? ఆ తప్పే టీమిండియా కొంప ముంచనుందా?
X
కరోనా విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలన్న విషయం టీమిండియా క్రికెట్ జట్టుకు ఇప్పటికైనా తెలిసి వచ్చి ఉంటుంది. ఐపీఎల్ చేదు అనుభవాన్ని మర్చిపోయి.. మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించిన జట్టు సభ్యుల్లో ఇద్దరికి పాజిటివ్ అని తేలగా.. మరో ముగ్గురు ఐసోలేషన్ లో ఉండి.. తమ పరిస్థితి ఏమిటో అర్థం కాక కిందా మీదా పడుతున్నారు. వచ్చే నెలలో ఇంగ్లండ్ లో జరిగే ఐదు టెస్టుల సిరీస్ కు సిద్ధమయ్యేందుకు వీలుగా టీమిండియా జట్టు ఆ దేశానికి వెళ్లటం తెలిసిందే.

తాజాగా జట్టు వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్.. దయానంద్ గరానీలు పాజిటివ్ గా తేలారు. వీరితో కాంటాక్టులో ఉన్న మరో ముగ్గురు (బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, రిజర్వ్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా, ఓపెనర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ ) ఐసోలేషన్ కు ముందస్తు జాగ్రత్తగా పంపారు. వీరికి నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టు ఫలితం ఇంకా రాలేదు. దీంతో.. టీమిండియాలో ఇప్పుడు కరోనా వణుకు తీవ్రమైంది.

ఇంగ్లండ్ పర్యటనకు ముందు జట్టు సభ్యులంతా కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నారు. అయితే.. ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఏమీ కూడా.. కరోనా రాకుండా అడ్డుకోలేవు. కాకుంటే.. కరోనా తీవ్రతను తగ్గించే వీలుంది. ఈ చిన్న పాయింట్ ను చాలా మంది మిస్ అవుతున్నారు. వ్యాక్సిన్ వేసుకున్నంతనే తమకు ఎలాంటి ప్రమాదం ఉండదన్న భావనలో ఉంటున్నారే తప్పించి.. దాని బారిన పడే అవకాశం ఉందన్న విషయాన్ని విస్మరిస్తూ.. అపాయాన్ని కొని తెచ్చుకున్నారు.

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా జట్టు సభ్యులకు కరోనా ఎలా సోకింది? జాగ్రత్తలు తీసుకుంటున్న వేళలోనూ ఇద్దరు పాజిటివ్ లు.. మరో ముగ్గురు ఐసోలేషన్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్న విషయంలోకి వెళితే.. జట్టు సభ్యుల నిర్లక్ష్యమే దీనికి కారణంగా చెప్పక తప్పదు. అయితే.. హోటల్ లేదంటే ప్రాక్టీస్ అన్నట్లుగా వ్యవహరించి ఉంటే.. ఇప్పుడీ సమస్య వచ్చేది కాదంటున్నారు. ఎందుకంటే.. బ్రేక్ సమయంలో బయటకు వెళ్లటం.. ముఖానికి మాస్కు పెట్టుకోకుండా ఉండటం లాంటి పనులే ఇప్పుడీ పరిస్థితికి కారణమని చెబుతున్నారు.

పాజిటివ్ గా తేలిన పంత్.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని.. అతడికి నిర్వహించే ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నెగిటివ్ వస్తే.. డర్హమ్ లో ఉన్న జట్టును కలిసే వీలుందని బీసీసీఐ చెబుతోంది. ఇంతకీ పంత్ కు కొవిడ్ ఎలా సోకిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. గత నెల 30న ఇంగ్లండ్ - జర్మనీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కు పంత్ హాజరు కావటం.. దీనికి సంబంధించిన ఫోటోల్ని అతడు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతను మాస్కు ధరించకుండా ఉండటం తెలిసిందే. దీనిపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి.

మ్యాచ్ నుంచి హోటల్ కు వచ్చిన తర్వాత పంత్ కు జ్వరం వచ్చింది. దీంతో పరీక్ష చేయటంతో పాజిటివ్ గా తేలింది. రద్దీగా ఉన్న చోట్లకు జట్టు సభ్యులు వెళ్లొద్దని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇప్పటికే చెప్పారు. అయినప్పటికీ యూరో చాంఫియన్ షిప్.. వింబుల్డన్ టోర్నీలకు వెళ్లి రావటం వల్లే కరోనా మహమ్మారి తగులుకుందన్న మాట వినిపిస్తోంది. టీమిండియా జట్టులో ఇప్పటికే రెండు కేసులు వెలుగు చూసి.. మరికొందరు ఐసోలేషన్ లో ఉన్నప్పటికి.. ఐదు టెస్టుల సిరీస్ కు కఠినమైన బయో బబుల్ ఉండదని స్పష్టం చేస్తున్నారు.

కరోనాతో కలిసి జీవించటం అలవాటు చేసుకోవాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ వ్యాఖ్యానిస్తున్నారు. కలిసి జీవించటం తప్పదన్న విషయం సరే.. అదెలా అన్న విషయంపై అవగాహన లేకుండా చేస్తున్న చేష్టలు కొత్త సమస్యల్నితీసుకొస్తున్నాయన్నది మర్చిపోకూడదు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. టీమిండియా జట్టు సభ్యులకు మరిన్ని జాగ్రత్తలు సూచించాల్సిన అవసరం ఉందంటున్నారు. లేనిపక్షంలో సిరీస్ మీద ప్రభావం చూపించటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.