Begin typing your search above and press return to search.

మూడేళ్ళ బాలుడికి కరోనా పాజిటివ్ .. తెలంగాణాలో 41కి చేరిన కేసులు !

By:  Tupaki Desk   |   26 March 2020 6:20 AM GMT
మూడేళ్ళ బాలుడికి కరోనా పాజిటివ్ .. తెలంగాణాలో 41కి చేరిన కేసులు !
X
కరోనా వైరస్ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతుంది. కరోనా వైరస్ కారణంగా దేశంలో ఇప్పటికే 12 మంది మృతి చెందగా, 664 మంది వ్యాధితో బాధపడుతున్నారు. ముఖ్యంగా కేరళ , మహారాష్ట్ర రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇక తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య క్రమకరంగా పెరుగుతోంది. తాజాగా మరో ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించారు. తాజాగా నమోదైన రెండు కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 41కు చేరింది.

కొత్తగా నమోదైన కేసులలో ఓ మహిళతో పాటు మరో మూడు సంవత్సరాల పసివాడికి కరోనా సోకినట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. గతంలో కరోనా వైరస్ సోకిన వ్యక్తిని కాంటాక్ట్ అయిన మహిళ కు ఈ రోజు కరోనా నిర్ధరణ అయింది. ఆమె ఎలాంటి విదేశీయానం చేయలేదు. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్టు వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. ఈ కేసుతో రాష్ట్రంలో ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. ఇక కరోనా బాధితుడు అయిన మూడేళ్ల బాలుడు గతంలో సౌదీ అరేబియా వెళ్లి వచ్చినట్టు ట్రావెల్ రికార్డు ఉంది. అయితే, కుటుంబం వివరాలు ఇంకా తెలియ రాలేదు. ప్రస్తుతం బాలుడికి చికిత్స అందిస్తున్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదు అయిన మొత్తం 41 కేసు లలో ఓ వ్యక్తి పూర్తిగా కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. కరోనా అనుమానిత లక్షణాలతో 50 మంది ఆస్పత్రిలో చేరినట్లు వైద్య బులెటిన్‌లో వెల్లడించారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రజలు బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.