Begin typing your search above and press return to search.

కరోనా వచ్చిన వారు టీబీ టెస్టులు చేయించుకోవాలట..!

By:  Tupaki Desk   |   18 July 2021 4:34 PM GMT
కరోనా వచ్చిన వారు టీబీ టెస్టులు చేయించుకోవాలట..!
X
ఏళ్లవుతున్నా కరోనా కంగారు మాత్రం తగ్గడం లేదు. రోజుకో కొత్తరకం వేరియంట్లతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారిని ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... కానీ తన ప్రభావాన్ని చూపిస్తూ... కంగారు పెడుతూనే ఉంది. శాస్త్రవేత్తలు ఎంతలా శ్రమించి మందులు కనుక్కుంటున్నా సరే సరికొత్త సవాళ్లను విసురుతూనే ఉంది. కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి. ఎంతో మంది పేద ప్రజలు ఒక పూట తినేందుకే అవస్థలు పడ్డారు. ప్రభుత్వాల ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. రోజురోజుకూ పెరుగుతూ పోతున్న కరోనా కంగారును నిలువరించేందుకు ప్రపంచంలోని చాలా దేశాల ప్రభుత్వాలకు కేవలం లాక్ డౌన్ మాత్రమే అస్త్రంలా కనిపించింది.

లాక్ డౌన్ విధించడం మూలాన అనేక మంది చిరువ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడతారని తెలిసినప్పటికీ ప్రభుత్వాలు వేరే గత్యంతరం లేక లాక్ డౌన్ ను విధించాయి. కరోనా కంగారు కాస్తంత తగ్గిందనుకునేలోపే రెండో వేవ్ రూపంలో మరలా విరుచుకుపడిన మహమ్మారి ఎవరూ ఊహించని విధంగా నష్టాన్ని మిగిల్చి పోయింది. మహమ్మారి ధాటికి అనేక మంది ఆస్పత్రులలో చేరి వేలు, లక్షల్లో ఖర్చు చేసుకుని బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో భయటపడ్డారు.

మన దేశం సంగతి తీసుకుంటే ఒకానొక సమయంలో మహమ్మారి ప్రభావంతో చనిపోయిన వారిని కాల్చేందుకు కూడా స్థలం లభించలేదంటే పరిస్థితి ఎంతలా చేయి దాటి పోయిందో ఇట్టే అర్థమవుతోంది. అలాంటి దుర్భర పరిస్థితుల నుంచి ఎలాగోలా బయటపడ్డామని అనుకునే లోపే మరో ఉపద్రవం ముంచుకొస్తుంది. త్వరలోనే కరోనా థర్డ్ వేవ్ వస్తుందని ఇది మొదటి రెండు కరోనా దశల కన్నా భయంకరంగా , మరింత ప్రమాద కరంగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా రోజుకో కొత్త కంగారుతో ప్రస్తుతం ప్రజలు రోజులు వెళ్లదీస్తున్నారు.

తాజాగా కరోనా రోగులకు టీబీ కూడా సోకుతుందని ప్రకంపనలు మొదలయ్యాయి. ఇలా కరోనాతో బాధపడి కోలుకుని టీబీ సోకిన కేసులు నిత్యం డజన్ల కొద్దీ వెలుగుచూస్తుండటంతో వైద్యులు కలవరపాటుకు గురవుతున్నారు. ఇలా ఉండగా... కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన ప్రకటన మరింత భయం కలిగించేలా ఉంది. కరోనా సోకిన అందరూ వీలైనంత త్వరగా టీబీ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. దాంతో పాటు టీబీ రోగులు ఉన్నా సరే వారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని తెలిపింది. మరో ఊరట కలిగే వార్తను కూడా ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ కారణంగా టీబీ వస్తుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పేర్కొంది.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినట్లే కనిపిస్తున్నా... కొన్ని రాష్ట్రాల్లో వైరస్‌ తీవ్రత అనుకున్న దానికంటే ఎక్కువగానే ఉంది. ఇక కరోనా గురించి ఇప్పటికే చాలా మంది సైంటిస్టులు అనేక హెచ్చరికలు చేశారు. కరోనాతో పోరాడి గెలిచిన ప్రతి ఆరుగురిలో ఒకరు దీర్ఘకాలికంగా బాధపడతారని బ్రిటన్‌లో సైంటిస్టులు గతంలోనే ప్రకటించారు. ఆరు నెలల వరకు తీవ్రమైన ఇబ్బందులు కరోనా రోగులను వెంటాడుతాయని తమ అధ్యయనంలో వెల్లడైందని పేర్కొన్నారు.