Begin typing your search above and press return to search.

ఓ వైపు కరోనా.. మరో వైపు వైరల్ ఫీవర్

By:  Tupaki Desk   |   29 Aug 2021 4:30 PM GMT
ఓ వైపు కరోనా.. మరో వైపు వైరల్ ఫీవర్
X
వానాకాలం వచ్చేసింది.. వ్యాధులను తీసుకొచ్చింది. ఇప్పటికే కరోనాతో అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో ఒళ్లు గుల్ల చేసుకున్న జనాలకు ఇప్పుడు వైరల్ ఫీవర్లు బయటపెడుతున్నాయి. దేశంలో ఒక వైపు కరోనా కేసులు పెరిగి భయపెడుతుంటే.. మరోవైపు వైరల్ ఫీవర్లు అంతకుమించిన నష్టాన్ని కలిగిస్తున్నాయి. మూడో వేవ్ ముప్పు ముంచుకొస్తున్న వేళ వైరల్ ఫీవర్లు డెంగ్యూ, చికెన్ గున్యా సహా ఇవన్నీ భయపెడుతున్నాయి.

సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ మరింత ఆందోళన కలిగించేలా కరోనా, వైరల్ ఫీవర్లు పొంచి ఉన్నాయి. థర్డ్ వేవ్ అక్టోబర్ నాటికి పతాక స్థాయికి చేరుకుంటుందన్న అంచనాల నేపథ్యంలో వైరల్ ఫీవర్లు భయపెడుతున్నాయి.

తాజాగా దేశంలో వైరల్ ఫీవర్ల సీజన్ వచ్చేసింది. గత ఏడాది ఈ టైంలో కరోనా తీవ్రస్థాయిలో ఉండేది. కానీ వైరల్ ఫీవర్లు ఏం చేయలేదు. కానీ ఈసారి రెండూ హడలెత్తిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో వైరల్ ఫీవర్ల విజ‌ృంభణ పీక్స్ కు చేరింది.

వానాకాలం దోమలకు మంచి సీజన్. దీంతో మలేరియా, డెంగ్యూ జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. ఉత్తర భారతంలో తీవ్రత ఎక్కువగానే ఉందట.. వెస్ట్ యూపీలో ఆరేడు జిల్లాల్లో కలిపి ఇప్పటికే వారం రోజుల్లో 50 మంది మరణించారట.. వైరల్ ఫీవర్ల కారణంగానే వీరి మరణం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో 26 మంది చిన్నారులు ఉండడం విషాదం నింపింది.

ఇక వైరల్ ఫీవర్ల లక్షణాలు కరోనాను పోలి ఉండడంతో చాలా మంది ఆ మందులు వేసుకొని నిర్లక్ష్యం చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వెంటనే పరీక్షలు చేయించుకోవడమే ఈ సమస్యకు ఉత్తమ పరిష్కారంగా చెబుతున్నారు.

ఇక పల్లెల్లోనూ మలేరియా, డెండీ కేసులు చోటుచేసుకున్నాయి. అసలే కరోనాతో మూలుగుతుంటే ఇలాంటి విషజ్వరాలన్నీ ఇప్పుడు కలిసికట్టుగా పడడంతో కాస్తంత జలుబు చేసినా.. లేనిపోని ఆందోళనకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఓ వైపు కరోనా దెబ్బకే కుదేలవుతుంటే.. మరోవైపు విషజ్వరాల విజృంభణతో మూలిగేనక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. గత ఏడాదిగా కరోనా ఇబ్బంది పెడుతుంటే.. ఇప్పుడు జ్వరాలు ప్రతాపం చూపుతున్నాయి. మాయదారి రోగాలన్నీ ఇప్పుడు దాపురించి జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.