Begin typing your search above and press return to search.

దేశంలో క‌రోనా కొత్త వేరియంట్ ‘క‌ప్పా’.. తొలి కేసు నమోదు!

By:  Tupaki Desk   |   14 July 2021 3:30 PM GMT
దేశంలో క‌రోనా కొత్త వేరియంట్ ‘క‌ప్పా’.. తొలి కేసు నమోదు!
X
క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచానికి స‌వాల్ విసురుతూనే ఉంది. శాస్త్ర‌వేత్తలు, వైద్యులు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. వెంట‌నే రూపం మార్చుకొని మ‌రో కొత్త వేరియంట్ గా మారిపోతోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్ని వేల రూపాలుగా మారిపోయిందో ఎవ్వ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితికి చేరిపోయింది. అయితే.. అందులో కొన్ని మాత్రం డ‌బుల్ మ్యుటెంట్లుగా మారి, మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా త‌యార‌వుతున్నాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు. ఇప్పుడు ‘క‌ప్పా’ వేరియంట్ ఒకటి వెలుగు చూసింది. దేశంలో తొలి కేసు నమోదైంది.

ప్రమాదకర కరోనా మ్యూటెంట్లలో డెల్టా వేరియంట్ డేంజర్ డబ్ల్యూహెచ్ వో చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఇందులోనూ డెల్టా ప్ల‌స్ మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారింద‌ని చెబుతున్నారు. దీంతో.. డెల్టా ప్ల‌స్‌ వేరియంట్ దేశంతోపాటు ప్ర‌పంచానికి సైతం ద‌డ పుట్టిస్తున్నది. ఈ వేరియంట్ వ్యాక్సిన్ల‌కు సైతం లొంగే అవ‌కాశాలు త‌క్కువేన‌ని నిపుణులు సందేహిస్తున్నారు. ఇటీవ‌ల‌ ఢిల్లీలోని గంగారామ్ ఆసుప‌త్రి వైద్యులు ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. తాము చేసిన అధ్య‌య‌నంలో ఈ విష‌యం వెల్ల‌డైంద‌ని , డెల్టా వేరియంట్ ను వ్యాక్సిన్ స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకోలేక‌పోతోంద‌ని చెప్పారు.

ఇలాంటి స‌మ‌యంలో ఇప్పుడు కొత్త‌గా ‘క‌ప్పా’ వైర‌స్ వెలుగు చూడడం ఆందోళ‌న క‌లిగించే అంశం. రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్ లో తొలి కేసు న‌మోదైంది. ఇటీవ‌ల 174 శాంపిల్స్ ను పుణెలోని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూబ్ ఆఫ్ వైరాల‌జీ ల్యాబ్ కు పంపించ‌గా.. ఇందులో 166 న‌మూనాలు డెల్టా వేరియంట్ గా నిర్ధారించ‌గా.. ఐదు కేసులు క‌ప్పా వేరియంట్ గా గుర్తించారు. ఆ త‌ర్వాత ఉత్త‌ర ప్ర‌దేశ్ లోనూ మ‌రో రెండు క‌ప్పా కేసుల‌ను కనుగొన్నారు. డెల్టా, డెల్టా ప్ల‌స్, లంబ్డా త‌ర్వాత ఇప్పుడు క‌ప్పా వేరియంట్ రావ‌డంతో.. జ‌నాల్లో మ‌రింత ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

క‌ప్పా వేరియంట్ ను B.1.617.1 పేరుతో పిలుస్తారు. అయితే.. ఇది డెల్టా ప్ల‌స్ స్థాయిలో అంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది కాదని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వైద్యాధికారులు తెలిపారు. దీనికి సాధార‌ణ‌ క‌రోనా వైద్య విధానం స‌రిపోతుంద‌ని తెలిపారు. కానీ.. డెల్టా ప్ల‌స్ మాత్రం ప్ర‌మాద‌క‌ర‌మైన‌ద‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల ఎయిమ్స్ వైద్యులు జ‌రిపిన ప‌రిశోధ‌న‌కు సంబంధించిన‌ నివేదిక సైతం ఇదే విష‌యాన్ని వెల్ల‌డించింది.

వైద్యులు మొద‌ట్నుంచీ చెబుతున్నట్టుగానే.. ఎలాంటి దీర్ఘ కాలిక రోగాలు లేనివారిని క‌రోనా ఏమీ చేయ‌లేద‌ని.. లంగ్స్‌, లివ‌ర్‌, కిడ్నీ, గుండె సంబంధిత రోగాల‌తో బాధ‌ప‌డుతున్న‌వారికి ఇబ్బంది కాస్త ఎక్కువ‌గా ఉంటుంద‌ని అంటున్నారు. వారు త‌గిన జాగ్ర‌త్త‌ల‌తో, ధైర్యంతో మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టాల‌ని సూచిస్తున్నారు. థ‌ర్డ్ వేవ్ ఘంటిక‌లు మోగుతున్న వేళ‌.. కీల‌క‌మైన విష‌యం కూడా చెప్పారు. ఇప్ప‌టికే కిడ్నీలు పాడైపోయిన వారు, పాక్షికంగా దెబ్బ‌తిన్న‌వారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు.

నోయిడాలోని జేపీ హాస్పిటల్‌లోని సీనియర్ కిడ్నీ మార్పిడి సర్జన్ డాక్టర్ అమిత్ దేవా చెబుతున్న వివ‌రాల‌ ప్రకారం.. న్యుమోనియా కారణంగా రక్తంలో ఆక్సీజన్ స్థాయి త‌క్కువ‌గా ఉంటుంది. దీనివల్ల కిడ్నీలో ఏటీఎన్ స‌మ‌స్య వ‌స్తుంద‌ట‌. అంటే.. ట్యూబ్యూల్ దెబ్బతినడం జ‌రుగుతుంద‌ట‌. కరోనా తీవ్రమైన సందర్భాల్లో.. కిడ్నీలతోపాటు ఇత‌ర అవయవాల మీద ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెప్పారు. ఇది ఆయా అవ‌య‌వాల్లో తీవ్రమైన వాపున‌కు దారితీస్తుంది, కిడ్నీల విష‌యానికి వ‌చ్చిన‌ప్పుడు భారీ నష్టం కలిగిస్తుంద‌ని దేవ్రా చెబుతున్నారు.

మూత్రపిండాలు శరీరంలోని విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపిస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. నిత్యం లీట‌ర్ల కొద్దీ నీటిని శుద్ధి చేస్తాయి. దీని ప‌నితీరును క‌రోనా వైర‌స్ డిస్ట్ర‌బ్ చేస్తుంద‌ని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్ -19 వైర‌స్ ర‌క్తం ప్ర‌వ‌హించే నాళాల్లో గడ్డకట్టడానికి కారణమవుతుందట‌. ఇది మూత్రపిండంలోని అతిచిన్న రక్త నాళాలను సైతం అడ్డుకుంటుందట‌. దీంతో.. కిడ్నీల ప‌నితీరు క్ర‌మ క్ర‌మంగా దెబ్బతీస్తుందని వైద్యులు అంటున్నారు. అందుకే.. అంద‌రూ రెండు డోజుల‌ వ్యాక్సిన్ తీసుకొని, క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టాల‌ని సూచిస్తున్నారు.