Begin typing your search above and press return to search.

కరోనా కిట్ల రేట్లు అంతలా తగ్గిపోయాయి

By:  Tupaki Desk   |   9 Oct 2020 12:45 PM IST
కరోనా కిట్ల రేట్లు అంతలా తగ్గిపోయాయి
X
ప్రపంచ వ్యాప్తంగా కరోనా తన రచ్చను ఏ మాత్రం ఆపట్లేదు. కాస్త ఫర్లేదులే అనుకున్నంతనే అమెరికాతో సహా పలు యూరప్ దేశాల్లో కరోనా రెండో దశ మొదలై చేస్తున్న ఆరాచకం అంతా ఇంతా కాదు. కేసులు తగ్గిపోయాయి అనుకున్నంతనే మళ్లీ మీద పడ్డ కరోనా భూతంతో ఆయా దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. దేశంలో ఇప్పుడిప్పడే కేసుల నమోదు తగ్గుముఖం పడుతోంది. ఆ మధ్యన రోజుకు 90 వేలకు పై చిలుకు కొత్త కేసులు నమోదు కాగా.. ఇటీవల కాలంలో 60 - 70 వేల లోపు నమోదవుతున్నాయి.

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీ ఎత్తున నమోదవుతున్నాయి. మొన్నటివరకు భారీగా కేసులు నమోదైన మహారాష్ట్రలో ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడితే.. అందుకు భిన్నంగా మొదట్లో చాలా తక్కువగా కేసులునమోదైన కేరళలో మాత్రం కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ఇప్పటికి రోజుకు 5వేలకు పైనే కేసుులు అక్కడ నమోదు కావటం గమనార్హం.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కరోనా నిర్దారణ పరీక్షలు గతంలో పోలిస్తే అన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి. మొదట్లో కరోనాను నిర్దారించే కిట్ల కొరత తీవ్రంగా ఉండేవి. అయితే.. వీటికున్న డిమాండ్ ను గుర్తించిన పరిశ్రమలు కొన్ని పెద్ద ఎత్తున వీటి తయారీలోకి దిగటంతో.. ఇప్పుడు కొరత అన్న సమస్య లేకపోగా.. కిట్ల ధరలు కూడా బాగా తగ్గిపోవటం గమనార్హం.

మొదట్లో ఆర్టీపీసీఆర్ కిట్ ధర రూ.2వేలు ఉంటే.. గత నెల నుంచి దీని ధర రూ.850కు తగ్గిపోయింది. ఇక.. ట్రూనాట్ కిట్ ధర రూ.1850 నుంచి రూ.1050కు తగ్గింది. యాంటీజెన్ కిట్ ధర కూడా తగ్గిపోయింది.గతంలో దీని ధర రూ.450 ఉంటే.. ఇప్పుడు మాత్రం రూ.375కే లభిస్తోంది. కిట్ల ధరలు ఇంతగా తగ్గిపోతున్నా.. కరోనా పరీక్షల్ని నిర్వహించే పలు ప్రైవేటు సంస్థలు మాత్రం తాము వసూలు చేసే మొత్తాన్ని మాత్రం తగ్గించకపోవటం గమనార్హం. ప్రభుత్వాలు సైతం.. తగ్గినకిట్ల ధరలకు తగ్గట్లే.. పరీక్షల ఫీజులు కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది.