Begin typing your search above and press return to search.

కరోనా: అమెరికా ఆరోగ్యవ్యవస్థ కుప్పకూలుతోందా?

By:  Tupaki Desk   |   11 Jan 2022 10:00 PM IST
కరోనా: అమెరికా ఆరోగ్యవ్యవస్థ కుప్పకూలుతోందా?
X
కరోనా కల్లోలానికి అమెరికా చిగురుటాకులా వణుకుతోంది. కరోనా వైరస్ తీవ్రతతో అక్కడి ఆస్పత్రులన్నీ నిండుతున్నాయి. కోవిడ్-19 ఉధృతి ఇప్పటికీ తగ్గడం లేదు. రూపాలు మార్చుకుంటూ విరుచుకుపడుతూనే ఉంది. యూరప్ దేశాలు, అమెరికాను గుప్పిటపట్టి వేధిస్తోంది. నూతన సంవత్సరం మొదటి నెలలో మిలియన్ల మంది అమెరికన్ల రోజువారీ జీవితాన్ని కరోనా మార్చేసింది.

కరోనా సోకి ఇప్పటికే అక్కడ భారీ స్థాయిలో రోగులు ఆస్పత్రుల్లో చేరిక పెరుగుతోంది. గత ఏడాది జనవరి 14న అక్కడ రికార్డు స్థాయిలో 1,42,273 మంది ఆస్పత్రిలో చేరగా.. తాజాగా సోమవారం ఒమిక్రాన్, ఇతర వేరియంట్లు సోకి 1,41,385 మంది ఆస్త్రిల్లో చికిత్స పొందుతున్నారు. ఈ సంఖ్య మంగళవారం నాటికి రికార్డు స్థాయి దాటేస్తోందని తేలింది.

అమెరికాలో ఒమిక్రాన్ ధాటికి ఊహించని స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య మరికొన్ని వారాల్లోనే 2,75,000 నుంచి 3,00,000 మధ్యలో ఉండొచ్చు. ఈ సంఖ్య జనవరి చివరి నాటికి వాస్తవరూపం ధరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సోమవారం కొలొరాడో, ఒరిగాన్, లూసియానా, మేరిల్యాండ్, వర్జినియాల్లో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించారు.

అమెరికాలో కరోనాతో ఆస్పత్రులన్నీ నిండడంతో వైద్యం అందిస్తున్న నర్సులు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. దీంతో అమెరికాలో వైద్య సిబ్బందికి తీవ్ర కొరత ఏర్పడింది. దేశంలోని 24శాతం ఆస్పత్రులకు ఇది సమానంగా మారింది.

కరోనా సోకినా ఎలాంటి లక్షణాలు లేకపోతే సిబ్బంది ఎన్95 మాస్కులు ధరించి విధులకు హాజరు కావాలని అమెరికా సర్కార్ సూచించిందంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి అమెరికాలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలుతోందని అర్థం చేసుకోవచ్చు.