Begin typing your search above and press return to search.

సీజనల్ వ్యాధిగా కరోనా ఐక్యరాజ్య సమితి సంచలన ప్రకటన!

By:  Tupaki Desk   |   18 March 2021 12:30 PM GMT
సీజనల్ వ్యాధిగా కరోనా ఐక్యరాజ్య సమితి సంచలన ప్రకటన!
X
కరోనా వైరస్ .. చైనా లో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి ఏడాదిన్నరగా ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 11.95 కోట్లు దాటింది. మరణాల సంఖ్య 26.50 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2.06 కోట్లకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం కరోనా సోకిన ప్రతి 100 మందిలో ఇద్దరు చనిపోతున్నారు. వ్యాక్సిన్ వచ్చినా కరోనా తీవ్రత మాత్రం తగ్గడం లేదు. కొత్త రూపాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో ప్రజల్లో ఇంకా భయాందోళనలు తొలగలేదు. కరోనా పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి కీలక ప్రకటన చేసింది.

కరోనావైరస్ మహమ్మారి గురించి ఐక్యరాజ్య సమితి మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. కరోనా వైరస్ సీజనల్‌ వ్యాధిగా మారే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు వాతావరణ అంశాల ఆధారంగా కరోనా నిబంధనలకు సడలింపులు ఇవ్వొద్దని ప్రపంచదేశాలకు సూచించింది. కరోనా వ్యాప్తిపై వాతావరణ మార్పులు, గాలి నాణ్యత ప్రభావాలపై యూఎన్ నిపుణుల బృందం అధ్యయనం చేసింది. దాని ఆధారంగా ఈ హెచ్చరిక జారీ చేసింది. శ్వాసకోశ వైరల్‌ ఇన్‌ ఫెక్షన్లు తరచూ సీజనల్‌గా మారతాయని ఈ నిపుణుల బృందం వెల్లడించింది. శీతాకాలంలో ఇన్‌ఫ్లూయెంజా విజృంభణ ఉంటుందని, సమశీతోష్ణ వాతావరణ పరిస్థితుల్లో జలుబు కరోనా వైరస్‌ వ్యాప్తి ఉంటుందని వెల్లడించింది. ఈ తీరు కొన్ని సంవత్సరాల పాటు కొనసాగితే, కరోనా సీజనల్‌ వ్యాధిగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొంది.

ఇదిలా ఉండగా..ఇప్పటివరకు కరోనా వ్యాప్తి వాతావరణ అంశాల కంటే ప్రభుత్వం విధించే నిబంధల ద్వారానే ఎక్కువగా ప్రభావితమైంది. మాస్కులు, ప్రయాణ ఆంక్షలు, లాక్ ‌డౌన్, కర్ఫ్యూ వంటి ప్రభుత్వ చర్యలు కరోనా వ్యాప్తిని దాదాపుగా కట్టడి చేస్తున్నాయి. అందువల్ల వాతావరణ అంశాల ఆధారంగా మాత్రమే ఆంక్షల సడలింపు దిశగా ప్రభుత్వాలు దృష్టి సారించలేవని నిపుణుల బృందం వెల్లడించింది.కొన్ని ప్రాంతాల్లో వేడి వాతావరణంలో కూడా ఈ మహమ్మారి విజృంభించిందని, రాబోయే సంవత్సరంలో ఇలాగే జరగదని చెప్పడానికి ఆధారాలు లేవని తెలిపింది. చల్లని, పొడి వాతావరణంలో, తక్కువ స్థాయిలో అతినీలలోహిత కిరణాల ప్రసారం ఉన్నప్పుడు వైరస్ ఎక్కువ కాలం మనుగడ సాగించినట్లు గుర్తించామంది.