Begin typing your search above and press return to search.

'కిమ్' కింగ్​డమ్ ​లో కరోనా మిస్టరీ.. అసలేం జరుగుతోంది..?

By:  Tupaki Desk   |   3 Jun 2022 11:30 AM GMT
కిమ్ కింగ్​డమ్ ​లో కరోనా మిస్టరీ.. అసలేం జరుగుతోంది..?
X
శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లు.. ఉత్తర కొరియా లో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కి తెలియకుండా చీమ కూడా చిటుక్కుమనదు. తన అధీనం లో ఉన్నదైతే కిమ్ ఏదైనా చేయగలడు కానీ.. ప్రపంచాన్ని గడగడలాడించి.. గాల్లోనే తిరుగుతూ.. లక్షల మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్న కరోనా మహమ్మారిని కిమ్ ఏం చేయగలడు. ప్రపంచ దేశాలన్నీ కరోనా బారిన పడి తేరుకుని.. టీకాలతో ఇమ్యూనిటీ పెంచుకున్నాయి. మరి ఉత్తర కొరియా పరిస్థితేంటి..? అసలు ఉత్తర కొరియాలో కరోనా కేసులు ఏ విధంగా ఉన్నాయి. తమ దేశంలో తొలి కరోనా కేసు నమోదైందని ఉత్తర కొరియా ప్రకటించి మూడు వారాలైంది. మరి అప్పటి నుంచి వైరస్ వ్యాప్తి నియంత్రణలోనే ఉందా..? దీనిపై అక్కడి ప్రభుత్వం ఏం చెబుతోంది..?

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి నెమ్మదిగా ఉత్తర కొరియాలోనూ ప్రవేశించింది. మరి ఆ దేశ అధ్యక్షుడు తన దేశంలో కరోనాను ఎలా కంట్రోల్ చేస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా మహమ్మారి బారిన పడిన వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపమని చెప్పట్లేదుగా.. ఏమో.. ఆయన కిమ్ జోంగ్ ఉన్. ఏమైనా చేయగలరు? ఇలాంటి అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే.. తన దేశంలో కరోనా తొలి కేసు నమోదైందని కిమ్ ప్రకటించి మూడు వారాలు గడుస్తోంది. కానీ దాని తర్వాత అక్కడ కరోనా నియంత్రణలోకి వచ్చిందా.. ? కేసులు తగ్గుముఖం పట్టాయా అనే విషయాలు ప్రపంచానికి తెలియవు? అసలు ఉత్తర కొరియాలో ఏం జరుగుతోంది..?

బయటి దేశాల్లో ఉంటూ.. ఉత్తర కొరియాలో నివసిస్తున్న తమ వారితో మాట్లాడిన వారి నుంచి అంతర్జాతీయ పత్రికలు కొంత సమాచారాన్ని సేకరించాయి. దక్షిణ కొరియా రాజధాని సియోల్ ఉంటున్న ఉత్తర కొరియా వాసి చైనా మధ్యవర్తి సాయంతో తన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు? ఆ ఫోన్ సారాంశం ఏంటంటే..?

ఉత్తర కొరియాలోని ప్రతి ప్రావిన్స్లో కరోనా మహమ్మారి విస్తరించింది. అక్కడ చాలా మందికి జ్వరం వచ్చింది. అందరూ జ్వరం తగ్గించే మందుల కోసం చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ దేశంలో ఔషధాల కొరత చాలా రోజులుగా తీవ్రంగా వేధిస్తున్న సమస్య. దాదాపు 15 శాతం జనాభా జ్వరంతో బాధపడుతున్నారు. ఔషధాలు లేకపోవడంతో దేవదారు ఆకులన్ని మరగబెట్టి ఆ రసం తాగమని అక్కడి వైద్యులు, ప్రభుత్వం సూచిస్తున్నాయి. కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల జ్వరాల సంఖ్యను బట్టే కరోనా కేసులను లెక్కించాల్సి ఉంటుంది. ఉన్న ఔషధాలను ప్రజలకు పంచిపెట్టాలని కిమ్ సైన్యానికి సూచించారు. అక్కడి ఆస్పత్రులు, మెడికల్ షాపుల్లో కూడా మందులు లేవు. ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు చీటీ రాసి ఇస్తారు. ఆ మందులు, చివరకు ఆపరేషన్కు అవసరమయ్యే మత్తు మందు కూడా ప్రజలే కొనుక్కోవాలి.

దాదాపు ఔషధాలన్నింటినీ చైనా నుంచే దిగుమతి చేసుకుంటారని.. గత రెండేళ్లుగా సరిహద్దులను మూసివేయడంతో మందుల సరఫరాకు అంతరాయం కలిగిందని అక్కడ పని చేసే ఓ డాక్టర్ చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి మొదలైందని ప్రకటించిన రోజే దేశం మొత్తం లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. ప్రజల్లో ఆందోళన మొదలైంది. చాలా మందికి ఆహారం కూడా అందుబాటులో లేదు. కొంత మందికి మాత్రం తమ ఇళ్లను వదిలి పంట పొలాల్లో పనిచేసేందుకు అనుమతిస్తున్నారు.

దక్షిణ కొరియా సరిహద్దుల వెంబడి ఉత్తర కొరియాలోని ప్రాంతాలపై తీసిన చిత్రాలను దక్షిణ కొరియా వార్తా సంస్థ ఎన్‌కే న్యూస్ ప్రచురించడంతో ఈ విషయం బయటకు వచ్చింది. చైనా సరిహద్దుల్లోని హ్యాన్‌సన్ నగరంలో మే నెలలో పది రోజులపాటు ప్రజలు ఇళ్లు వదిలి వెళ్లకుండా ఆంక్షలు విధించినట్లు వెల్లడించింది. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత చాలామంది ప్రజలు ఇళ్లలోనే కూప్పకూలినట్లు సమాచారం. ఆహారం లేక ప్రజలు చిక్కిపోయి కదలలేని పరిస్థితికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు కేవలం 70 మరణాలు మాత్రమే ఉత్తర కొరియా అధికారికంగా ప్రకటించినట్లు తెలుస్తోంది. అంటే ఉత్తర కొరియా కొవిడ్ మరణాల రేటు 0.002 శాతంగా ఉంది. ఇది ప్రపంచంలోనే అతి తక్కువ. మరోవైపు ఉత్తర కొరియా లో సరైన ఆరోగ్య వ్యవస్థ లేదని.. కరోనా టీకాలు కూడా వేయడం లేదని.. ఇంత తక్కువ కేసులు నమోదయ్యాయంటే నమ్మశక్యంగా లేదని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు.

గత వారంలో కొత్తగా నమోదైన కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దీనిపై అక్కడి ప్రభుత్వ వార్తా పత్రికలో ఒక సంపాదకీయాన్ని కూడా ప్రచురించారు. కొవిడ్-19 వ్యాప్తిని అధికారులు అడ్డుకోగలిగారని దీనిలో పేర్కొన్నారు. ఉత్తర కొరియాలో పరిస్థితులు ఏమీ మెరుగుపడలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఎమర్జెన్సీ ఆరోగ్య విభాగం అధికారి డాక్టర్ మైక్ ర్యాన్ ఆందోళన వ్యక్తం చేశారు. డేటాను పరిశీలించేందుకు ఉత్తర కొరియా అనుమతించడం లేదని అన్నారు. కేసుల విషయంపై తమకు ఎలాంటి స్పష్టత లేదని పేర్కొన్నారు. వ్యాక్సిన్లు పంపిస్తామని మళ్లీ మళ్లీ చెబుతున్నా ఉత్తర కొరియా స్పందించడం లేదని ఆయన వెల్లడించారు.

టీకాల కోసం ఉత్తర కొరియా చైనా పైనే పూర్తిగా ఆధార పడుతున్నట్లు తెలుస్తోంది. మార్చి నుంచి ఏప్రిల్ మధ్య చైనా నుంచి ఉత్తర కొరియాకు దిగుమతులు రెండింతలు పెరిగాయని కస్టమ్స్ డేటా చెబుతోంది. రెండేళ్లపాటు సరిహద్దులను మూసివేసిన తర్వాత మళ్లీ ఈ ఏడాదే సేవలను ప్రారంభించారు. గత నెలల్లో ఔషధాల దిగుమతులు భారీగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఏప్రిల్‌లో చైనా నుంచి ఉత్తర కొరియా వెయ్యి వెంటీలేటర్లు దిగుమతి చేసుకుంది.

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి మొదలైన తర్వాత ఉత్తర కొరియా వెంటీలేటర్లు దిగుమతి చేసుకోవడం ఇదే తొలిసారి. చైనా డేటాలో వెంటీలేటర్లు అంటే ఆక్సిజన్ చికిత్స అందించే చిన్నచిన్న వైద్య పరికరాలు కూడా ఉంటాయి. మరోవైపు జనవరి నుంచి ఏప్రిల్ మధ్య 90 లక్షల మాస్క్‌లను ఉత్తర కొరియా దిగుమతి చేసుకుంది. ఏప్రిల్ 17న సాయం కోసం ఏడు రవాణా విమానాలను చైనాకు ఉత్తర కొరియా పంపినట్లు దక్షిణ కొరియా ప్రభుత్వ సమాచారం వెల్లడిస్తోంది.