Begin typing your search above and press return to search.

విదేశాల నుంచి కరోనాను తీసుకొస్తున్నారు..

By:  Tupaki Desk   |   17 March 2020 8:16 AM GMT
విదేశాల నుంచి కరోనాను తీసుకొస్తున్నారు..
X
భారతదేశంలో కరోనా వైరస్ బాధితులు పెరుగుతున్నారు. అయితే ఈ కేసులన్నీ కూడా దేశంలో ఉన్న వారికి రావడం లేదు. కేవలం విదేశీ ప్రయాణం చేసి వచ్చిన వారి తో.. విదేశీయుల వలన ఈ వైరస్ వ్యాపిస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణకు కూడా ఇదే చిక్కులు తెస్తోంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు నాలుగుకు చేరాయి. ఎందుకంటే హైదరాబాద్‌ సమీపంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి విదేశీయులు, ప్రవాస భారతీయులు వస్తుండడం తో ఈ కరోనా కేసులు బయటపడుతున్నాయి. దీంతో హైదరాబాద్ మహానగరం కరోనా బారిన పడుతోంది. తెలంగాణలో ఇప్పటివరకు నాలుగు కరో్నా పాజిటివ్ కేసులు, 19 అనుమానిత కేసులు నమోదయ్యాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. వెంటనే అనుమానితులను పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ఐసోలేషన్ వార్డులకు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతున్నారు.

పాజిటివ్ కేసులు నమోదైన వారిని హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా వ్యాప్తి తీవ్రమవుతుండడం తో తెలంగాణ ప్రభుత్వం దీనికి కారణం అన్వేషిస్తోంది. అయితే అధికారుల పరిశీలనలో ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు తెలంగాణ లో ఉన్న ప్రజలెవరికీ కరోనా వ్యాప్తి చెందలేదని గుర్తించారు. ఈ కరోనా కేవలం విదేశాల నుంచి వస్తున్న వారితోనే వస్తుందని అంచనాకు వచ్చారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

కరోనా నివారణకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని నిమ్స్, సరోజిని ఆస్పత్రి, గచ్చిబౌలి స్టేడియంతో పాటు అనంతగిరి, దూలపల్లి అటవీ అకాడమీలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటుచేసింది. వెంటనే కరోనా అనుమానితులను ఆ కేంద్రాలకు తరలిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. విదేశాల నుంచి వచ్చినవారికి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం లో థర్మల్‌ స్కీృనింగ్‌ పరీక్షలు మరింత కట్టుదిట్టంగా నిర్వహించాలని వైద్యులు చెబుతున్నారు. ఆయా దేశాల నుంచి హైదరాబాద్ కు చేరుకోగానే కొన్ని రోజుల పాటు వ్యక్తిగతంగా ఎవరికి వారే ఇళ్లకే పరిమితం (ఐసోలేట్‌ )కావాలని, వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేసుకున్న తర్వాతే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల్లో దుబాయ్, ఇటలీ, నెదర్లాండ్స్, స్కాట్లాండ్‌ దేశాల నుంచి వచ్చిన వారే ఉన్నారు.

ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో చైనా, ఇటలీ, ఇరాన్, స్పెయిన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, స్విట్జర్లాండ్, యుకె, నార్వే, నెదర్లాండ్స్, మలేషియా, బెల్జియం తదితర దేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చే వారికి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి ప్రవేశించగానే వారికి కోవిడ్‌ ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఆయా దేశాల నుంచి వచ్చిన వారు నేరుగా అందరినీ కలవకుండా ఎవరికి వారే తమ ఇళ్లలో సుమారు 14 రోజుల పాటు ఎవరినీ కలవకుండా ఉండాలని సూచిస్తున్నారు. తాము వాడే వస్తువులు ఇతరులు వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.