Begin typing your search above and press return to search.

తెలంగాణలో కరోనా భారిన పడుతున్న విద్యార్థులు .. ఒక్కరోజే 86 మందికి .. !

By:  Tupaki Desk   |   19 March 2021 7:00 AM GMT
తెలంగాణలో కరోనా భారిన పడుతున్న విద్యార్థులు .. ఒక్కరోజే 86 మందికి ..  !
X
కరోనా వైరస్ జోరు దేశంలో మళ్లీ పెరిగిపోతుంది. ఒకవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్నా కూడా మరోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా స్కూళ్లల్లో కరోనా కదం తొక్కుతుంది. పాఠశాలల్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. స్కూల్స్ లో క్రమంగా కరోనా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకి స్కూళ్లలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వందల సంఖ్యలో విద్యార్థులు వైరస్ బారిన పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా ఒక్కరోజే పలు స్కూళ్లకు చెందిన 86మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. దీనితో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల, మేడ్చల్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లోని స్కూల్స్ లో వైరస్ వ్యాప్తి చెందుతోంది.

తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని రెండు ప్రభుత్వ పాఠశాలల్లో 28మంది విద్యార్థులకు పాజిటివ్ గా నిర్ధరణ అయ్యింది. రాజేంద్రనగర్ ఎస్టీ బాలుర వసతి గృహంలో 105మంది విద్యార్థులకు టెస్టులు చేస్తే 24మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. దీనితో స్కూల్ రెండో అంతస్తులో వారందరిని ఐసోలేషన్ లో ఉంచారు అధికారులు. విద్యార్థులంతా రాజేంద్రనగర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. దీంతో ఆ స్కూల్ లో చదువుతున్న తోటి విద్యార్థులకు కూడా టెస్టులు చేయగా, మరో ఇద్దరు విద్యార్థులకు కోవిడ్ నిర్ధరణ అయ్యింది. వారిని హోంక్వారంటైన్ చేశారు. శంషాబాద్ మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. 8వ తరగతి విద్యార్థులు వైరస్ బారిన పడ్డారు. మేడ్చల్ జిల్లా నాగోల్ స్కూల్ లో హెడ్మాస్టర్ కు పాజిటివ్ రావడంతో టీచర్లు భయాందోళన చెందుతున్నారు. ప్రధాన ఉపాధ్యాయుడు మహారాష్ట్ర వెళ్లి రావడం, అనారోగ్యంతో ఉన్నా స్కూల్ కి రావడాన్ని టీచర్లు తప్పు పడుతున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 750మంది విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సి రావడం ఇబ్బందిగా మారిందంటున్నారు.

తెలంగాణలో కొత్త‌ క‌రోనా కేసుల సంఖ్య చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ 300కి పైగా న‌మోదైంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కొత్త‌గా 313 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 142 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,360కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,98,262 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,664గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 2,434 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.