Begin typing your search above and press return to search.

కరోనా నాలుగో వేవ్.. కేసులు, మరణాలు పెరగడం అందుకు సూచన!

By:  Tupaki Desk   |   24 April 2022 3:11 PM IST
కరోనా నాలుగో వేవ్.. కేసులు, మరణాలు పెరగడం అందుకు సూచన!
X
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుతుంది అనుకుంటుండగా.. మరో కొత్త వేరియంట్ తో ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అయితే కరోనా థర్డ్ వేవ్ తర్వాత భారీగా తగ్గిన కేసులు, మరణాలు మళ్లీ పెరగడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. కరోనా కట్టడి కోసం చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలకు సూచనలు కూడా చేసింది. ప్రస్తుతం దిల్లీ సహా ముంబై తదితర ప్రాంతాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో మాస్కు తప్పనిసరి చేశారు.

అయితే శనివారం రోజు కూడా కేసులు సంఖ్యలు స్వల్పంగా పెరిగాయి. దేశంలో గత 24 గంటల్లో 2 వేల 593 కేసులు నమోదు అవ్వగా.. 44 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోలిస్తే... 66 కేసులు, 11 మరణాలు పెరిగాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 15 వేల 873 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు స్పష్టం చేసింది.

అయితే తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. మొత్తం కేసుల సంఖ్య 4,30,57,545కి చేరింది. కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,22,193 కి పెరిగింది. అలాగే నిన్న కరోనా నుంచి 1,755 మంది కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,25,19,479కి చేరింది. దేశంలో రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. అలాగే ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 187,67,20,318 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. నిన్న 19,05,374 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.

కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే... కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది అంటున్నారు. అందు వల్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదని... ఒక వేళ వెళ్లినా మాస్కు తప్పని సరి అని సూచిస్తున్నారు.

అలాగే భౌతిక దూరం పాటించడం.. చేతులను తరచుగా కడుక్కోవడం వంటివి చేయడం మంచిదని వివరిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలను, వృద్ధులను, బీపీ, షుగర్, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారిని మరింత జాగ్రత్తగా చూస్కోవాలని పేర్కొంటున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలన్నీ మాస్కు నిబంధనను కచ్చితం చేయాలని సూచిస్తున్నారు.