Begin typing your search above and press return to search.

జపాన్‌ నౌకలో ఇద్దరు భారతీయులకు కరోనా..రక్షించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి

By:  Tupaki Desk   |   13 Feb 2020 10:00 AM GMT
జపాన్‌ నౌకలో ఇద్దరు భారతీయులకు కరోనా..రక్షించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి
X
జపాన్‌ తీరప్రాంతం యొకొహామా పోర్టులో నిలిపివేసిన డైమండ్‌ ప్రిన్సెస్‌ ఓడలో ప్రయాణిస్తున్న వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా..135 మంది కోవిద్‌-19 (కరోనా వైరస్‌) పాజిటివ్‌ గా తేలింది. అందులో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. నౌక లో ఉన్న మిగిలిన వారు ఆందోళనకి గురౌతున్నారు. జపాన్‌ కు చెందిన పర్యాటక నౌక డైమండ్‌ ప్రిన్సెస్‌ లో నుంచి హాంగ్‌ కాంగ్‌లో దిగిన ఓ వ్యక్తికి కరోనా వైరస్‌ సోకినట్లు గుర్తించిన నేపథ్యంలో..ఫిబ్రవరి 3ను నౌకను యొకొహామా పోర్టులోనే నిలిపేశారు. డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో మొత్తం 3700 మంది ప్రయాణికులుండగా..వీరిలో 138 మంది భారతీయులున్నట్లు సమాచారం.

నౌకలో చిక్కుకున్న తమిళనాడు లోని మధురైకి చెందిన అంబలగన్‌ తమను కాపాడాలని వేడుకుంటూ వీడియోలను షేర్‌ చేయడం తో ఇప్పుడు ఈ వార్త వైరల్‌ గా మారింది. ప్రయాణీకులను ఎక్కడికీ కదలకుండా ఉంచారని, వారు ఉన్న గదులకే ఆహారాన్ని పంపుతున్నారని వీడియోలో ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఎక్కువ రోజులు నౌకలోని ఉంటే తమకూ కరోనా వైరస్‌ సోకే ప్రమాదం పొంచి ఉందని, తమను భారత ప్రభుత్వం కాపాడాలని సిబ్బంది తరపున అంబలగన్‌ వేడుకున్నారు.

సిబ్బందికి కేటాయించిన మెస్‌లో భోజనం చేస్తామని దీంతో తమకు సులభంగా వైరస్‌ సోకే ప్రమాదం ఉందని, తమను ఇక్కడ నుంచి భారత్‌కు తీసుకువెళ్లాలని అంబలగన్‌ అభ్యర్థించారు. మరో భారత సిబ్బంది వినయ్‌ కుమార్‌ సర్కార్‌ కూడా డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో చిక్కుకున్న భారత సిబ్బందిని వెనక్కి పిలిపించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ ఓ వీడియో రూపొందించారు. గతంలో పాక్‌ సేనల నుంచి ఐఏఎఫ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ ను కాపాడినట్లే తమనూ ఇక్కడి నుంచి రక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

నౌకకు సంబంధించిన ప్రోటోకాల్స్ తమను వీడియో షేర్‌ చేసేందుకు అనుమతించకపోయినా అసలు తాము అప్పటివరకూ బతికిఉంటమనే నమ్మకం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ డైమండ్ ప్రిన్స్ నౌక సిబ్బందిలో 132 మంది భారతీయులు, ప్రయాణికుల్లో ఆరుగురు భారతీయులు ఉన్నారు. కాగా , ఫిబ్రవరి 19, 2020 వరకు క్రూయిజ్ షిప్‌ నిర్భందంలోనే ఉంచుతున్నట్లు జపాన్ అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా, ఫిబ్రవరి 12, 2020 నాటికి, నౌకలో ఉన్న ఇద్దరు భారతీయ సిబ్బంది సహా మొత్తం 174 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని రిపోర్టుల్లో తేలింది.