Begin typing your search above and press return to search.

ఢిల్లీకి వచ్చిన ఆఫ్ఘన్ శరణార్థులకు కరోనా .. 16 మందికి పాజిటివ్ !

By:  Tupaki Desk   |   25 Aug 2021 1:01 PM IST
ఢిల్లీకి వచ్చిన ఆఫ్ఘన్ శరణార్థులకు కరోనా .. 16 మందికి పాజిటివ్ !
X
ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల పాలన ప్రారంభం కావడంతో అక్కడ ఉన్న ప్రజలు , ఇతర దేశ వాసులు ఆఫ్ఘన్ నుండి వెళ్లిపోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అప్ఘానిస్తాన్‌ లో చిక్కుకున్న భారతీయులతో పాటు అప్ఘన్ శరణార్థుల తరలింపును కేంద్రం ముమ్మరం చేసింది. ప్రత్యేక విమానాల్లో వారిని ఢిల్లీకి చేరవేస్తోంది. అయితే , కాబూల్ నుంచి వస్తున్న వారిలో పలువురికి కరోనా నిర్ధారణ కావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.

తాలిబాన్లు కాబూల్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత అప్ఘానిస్తాన్‌ లో అల్లకల్లోలం నెలకొంది. ప్రాణాలరచేత పట్టుకొని అక్కడి ప్రజలు విదేశాలకు వలస పోతున్నారు. భారత్‌ కూడా వారికి ప్రత్యేక ఎమర్జెన్సీ వీసాలను జారీచేసి, విమానాల్లో తరలిస్తోంది. మంగళవారం మరో ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీకి చేరింది. అందులో 44 మంది అప్ఘనిస్తాన్ సిక్కుల సహా మొత్తం 78 మంది భారత్‌కు వచ్చారు. కాబూల్‌ నుంచి తజకిస్థాన్‌ లోని దషాంబే మీదుగా ఢిల్లీకి వారిని తరలించారు. అప్ఘానిస్తాన్ సిక్కులకు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి స్వయంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన మూడు సిక్కుల పవిత్ర గ్రంథాలను కేంద్రమంత్రి హర్దీప్ సింగ్‌ కు వారు అందజేశారు. ఈ కాపీలను ఆయన భక్తి ప్రపత్తులతో శిరసుపై పెట్టుకుని తీసుకువచ్చి గురుద్వారాకు చేర్చారు.

కాబూల్ నుంచి వచ్చిన వారికి ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కరోనా పరీక్షలు నిర్వహించగా 16 మందికి పాజిటివ్ వచ్చింది. వారిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. ఐతే అప్ఘనిస్తాన్ నుంచి వస్తున్న వారికి కేంద్రం 14 రోజుల క్వారంటైన్ తప్పని సరిచేసిన విషయం తెలిసిందే. ఈ నెల 23 న ఆరోగ్య శాఖ జారీ చేసిన గైడ్ లైన్స్ ప్రకారం, విదేశాల నుంచి..ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియా చేరిన వారికీ 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి ఇది అనివార్యమని ఈ శాఖ వివరించింది. ఆఫ్ఘానిస్థాన్‌ నుంచి ఇప్పటివరకు 626 మంది భారత్‌ కు వచ్చారని కేంద్ర మంత్రి హరిదీప్‌ సింగ్‌ పూరి తెలిపారు.

వీరిలో 228 మంది భారతీయులు, 77 మంది ఆఫ్ఘనిస్థాన్‌ కు చెందిన సిక్కులు ఉన్నారని వెల్లడించారు. ఈ 626 మందిలో భారత దౌత్య సిబ్బంది లేరని కేంద్రం తెలిపింది. ఆ ఉద్యోగులతో కలుపుకుంటే కాబూల్ నుంచి ఇండియాకు వచ్చిన వారి సంఖ్య మరింత పెరుగుతుంది. తరలింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.ఆఫ్ఘానిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులకు సమాన ప్రయారిటీ ఇస్తామని ప్రభుత్వం ఇదివరకే తెలిపింది. ‘ఆపరేషన్ దేవీ శక్తి’ పేరిట ఇండియా ఈ నెల 16 నుంచి భారతీయుల తరలింపును ప్రారంభించింది. అంతకు ముందు రోజే కాబూల్ నగరాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నారు.