Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్: తెలంగాణ షట్ డౌన్...మార్చి 31 వరకు అన్ని బంద్ !

By:  Tupaki Desk   |   14 March 2020 12:42 PM GMT
కరోనా ఎఫెక్ట్: తెలంగాణ షట్ డౌన్...మార్చి 31 వరకు అన్ని బంద్ !
X
భారతదేశంలో కరోనా విజృంభిస్తుండడం తో రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. దేశంలో 84 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

తెలంగాణలో కరోనా ఉద్ధృతిపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన అసెంబ్లీ ప్రాంగణం లో నిర్వహించిన హైలెవల్ కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. కరోనా పై వైద్య అధికారులకు సీఎం కేసీఆర్ కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా, విదేశాల నుంచి వస్తున్న వారి ద్వారానే కరోనా వ్యాప్తి జరుగుతున్నట్టు గుర్తించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రం లో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 31వ తేదీ వరకు స్కూళ్లు మూసేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు మాత్రం యథాతథంగా జరగనున్నాయి. అలాగే, మార్చి 19 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలు మాత్రం యధావిధిగా జరుగుతాయి అని ప్రభుత్వం తెలిపింది. అలాగే స్కూల్స్ తో పాటుగా షాపింగ్ మాల్స్, థియేటర్లని మూసేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. దీనిపై ఈ రోజు సాయంత్రం జరగబోయే కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు.

కరోనా ప్రభావంతో రాష్ట్రం లో తీసుకోవాల్సిన ముందస్తు చర్యల మీద తెలంగాణ ప్రభుత్వం హైలెవల్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా ఎలాంటి చర్యలు చేపట్టాలని చర్చించారు. దీనిపై తెలంగాణ కేబినెట్‌ లో అధికారికంగా చర్చించిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. మరోవైపు, ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాలు సోమవారం తో ముగియనున్నాయి. వాస్తవానికి ఈ నెల 20 వరకు ఈ సమావేశాలు జరగాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రేపు, ఎల్లుండి సమావేశాలు నిర్వహించి.. సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి దానికి ఆమోదం తెలిపిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేయనున్నారు.

ఈ కరోనా వైరస్ ప్రభావం తో గోవా, రాజస్థాన్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు సెలవులను ప్రకటించాయి. తెలంగాణ పొరుగున ఉన్న కర్ణాటకలో మార్చి 31 వరకు మాల్స్, ధియేటర్లు బంద్ చేశారు. పెళ్లిళ్లు, పబ్లిక్ ఫంక్షన్లు కూడా నిర్వహించవద్దని సూచించారు. కరోనా వైరస్ ప్రభావం తో ఇప్పటివరకు భారత్‌ లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక నుంచి ఒకరు, ఢిల్లీలో మరో మహిళ చనిపోయారు. తెలంగాణ లో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. బాధితుడు కొన్ని రోజుల క్రితం ఇటలీ నుంచి వచ్చాడు. అతడిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.