Begin typing your search above and press return to search.

వెబ్ మీడియాకు అన్ని కోట్లు నష్టమా? ప్రభుత్వం ఆదుకుంటుందా?

By:  Tupaki Desk   |   4 May 2020 8:30 PM IST
వెబ్ మీడియాకు అన్ని కోట్లు నష్టమా? ప్రభుత్వం ఆదుకుంటుందా?
X
కరోనా కాటు.. మనిషినే కాదు.. వ్యవస్థలను కబళిస్తోంది. నామ రూపాలు లేకుండా చేస్తోంది. ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తోంది. వేల మందికి ఉపాధిని దూరం చేస్తోంది. అందరిని ఇంట్లో కూర్చుండబెట్టి పనిలేక.. పస్తులు ఉంచుతోంది. కరోనా లాక్ డౌన్ ముగిశాక ఎంతమంది ఉద్యోగాలు పోయి.. ఎన్ని పరిశ్రమలు మూతపడుతాయో ఊహించుకుంటేనే భయం వేస్తోంది.

ఇక కరోనా ఎఫెక్ట్ పరిశ్రమలు, వాణిజ్యం మనుషులపైనే కాదు మీడియా రంగంపైన కూడా తీవ్రంగా పడింది. ఇప్పటికే పత్రికలన్నీ ఉద్యోగులను ఇంటికి పంపాయి. జిల్లా టాబ్లాయిడ్స్ ఆగిపోవడంతో హైదరాబాద్ లాంటి కేంద్రాల్లో తప్ప జిల్లాల్లో జర్నలిస్టులకు పనిలేని పరిస్థితి. మళ్లీ రికవరీ అయితేనే జర్నలిస్టులకు పని. లేదంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది.

ఇక న్యూస్ చానెల్స్ పరిస్థితి ఏమంతా బాగోలేదు. ఇప్పటికే చాలా చానళ్లు జర్నలిస్టులను, రిపోర్టర్లను, కెమెరామెన్, యాంకర్స్ ను ఇంటికి పంపాయి. దేశంలోని దిగ్గజ మీడియా సంస్థల్లోనూ తీసివేతలున్నాయి.

ఇక అన్నింటికంటే ముఖ్యమైంది వెబ్ మీడియా.. ప్రపంచంలోనే వేగంగా సమాచారం ఇచ్చే మీడియా.. ఈ వెబ్ మీడియాకు భారత దేశంలో కష్టకాలం వచ్చింది. కరోనా దెబ్బకు భారత్ లో దాదాపు 2000 కోట్లు నష్టం వచ్చిందని సమాచారం. సినిమాలు లేక.. గూగుల్ యాడ్స్ సరిగా లేక అదేవిధంగా మిగతా అడ్వటైజ్ మెంట్స్ యాడ్స్ సరిగా ఇవ్వలేని కారణంగా దాదాపు 200 కోట్లు నష్టం వాటిలినట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెబ్ మీడియాను పేజీ వ్యూస్ ప్రకారం ఆదుకోవాలని వెబ్ మీడియా సంస్థలు కోరుకుంటున్నాయి.

నిజానికి అందరినీ ఆదుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీడియా అనేసరికి మాత్రం మొహం చాటేస్తున్నాయి. ప్రభుత్వాల లోటుపాట్లను ఎత్తి చూపి ప్రజల కోసం పనిచేసే ఈ ఫోర్త్ ఎస్టేట్ పై ప్రభుత్వాలు శీతకన్ను వేస్తున్నాయి. మీడియా ఎంత బలహీనంగా ఉంటే పాలకులకు అంత బలం. అందుకే కరోనా దెబ్బకు మీడియా యాజమాన్యాలు, వెబ్ మీడియా అతలాకుతలం అవుతున్నా ఇప్పటివరకు వాటికి ప్యాకేజీ కానీ.. ఆదుకునే ప్రయత్నం కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం లేదు. ఇప్పటికైనా ముఖ్యంగా సమాచారాన్ని వేగంగా అందరికంటే ఫాస్ట్ గా ఇచ్చే వెబ్ మీడియాను అయినా కేంద్రం ఆదుకోవాలని ఆయా సంస్థలు కోరుతున్నాయి.