Begin typing your search above and press return to search.

ఆర్టీసీని వదలని కరోనా.. భారీ నష్టాలు

By:  Tupaki Desk   |   16 March 2020 11:30 PM GMT
ఆర్టీసీని వదలని కరోనా.. భారీ నష్టాలు
X
కరోనా వైరస్ వ్యాప్తి ప్రజా జీవనాన్ని స్తంభిస్తోంది. ఇప్పటికే పాఠశాలలు - కళాశాలలు - థియేటర్లు - షాపింగ్ మాల్స్ పై తీవ్ర ప్రభావం పడింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. రద్దీ ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో సంచరించవద్దని ప్రభుత్వం - వైద్యులు చెబుడుతుండడంతో ప్రజలు ప్రయాణాలు తగ్గించారు.. అత్యవసరమైతే మినహా బయటకు రావడానికి సాహసించడం లేదు. దీంతో రోడ్లు ప్రజలు లేక నిర్మానుష్యమయ్యాయి. అయితే దీని ప్రభావంతో ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీకి తీవ్ర నష్టం వస్తోంది. తెలంగాణలో విద్యాలయాలు - థియేటర్లు - షాపింగ్ మాల్స్ 31వ తేదీ వరకు మూసి వేయాలని ప్రకటించడం, బహిరంగ ప్రాంతాల్లో కార్యక్రమాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఇప్పటికే మూడు కరోనా పాజిటివ్ కేసులు తేలడంతో దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో తీవ్రంగా ఉంది.

రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ మధ్య మాత్రం వాహనాల రాకపోకలు ఏమాత్రం తగ్గలేదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాదిరి కన్నా అధికంగా రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఈ క్రమంలో క్రమంగా తెలంగాణకు ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసులు భారీగా ఉన్నాయి. అయితే తెలంగాణలో కరోనా వ్యాపించడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాసులు ప్రయాణాలు తగ్గించేసుకున్నారు. హైదరాబాద్ కు వెళ్లే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. దీంతోపాటు అక్కడ కొంత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రయాణాలు తగ్గిపోయాయి. రాష్ట్రంలోనే వివిధ జిల్లాలకు వెళ్లే వారి సంఖ్య తగ్గింది. ముఖ్యంగా విశాఖపట్టణం - విజయవాడ - తిరుపతి - నెల్లూరు - కడప - కర్నూలు ప్రాంతాలకు జన సందడి కనిపించడం లేదు. పర్యాటకులు రావడం కూడా తగ్గారు.

రాష్ట్రంలో లాభాల్లో ఉన్న డిపోల్లో విజయవాడ, -ఆటోనగర్‌ తొలిస్థానాల్లో ఉంటాయి. ఈ డిపోల నుంచి భారీ సంఖ్యలో దూర ప్రాంతాలకు హై ఎండ్‌ బస్సులు నడుస్తుండగా ప్రస్తుతం వీటిపై కూడా తీవ్ర ప్రభావం పడింది. హైఎండ్‌ బస్సుల శ్రేణిలో వెన్నెల స్లీపర్‌ - అమరావతి - గరుడ ప్లస్‌ - గరుడ - నైట్‌ రైడర్‌ - ఇంద్ర వంటి ఏసీ బస్సులతో పాటు - సూపర్‌ లగ్జరీ వంటి నాన్‌ ఏసీ బస్సులు కూడా ఉండగా ఇప్పుడు వీటిలో ఆక్యుపెన్సీ దారుణంగా తగ్గిపోతోంది. ఒక్క కృష్ణా రీజియన్‌ లోనే ఆర్టీసీకి రూ.10 కోట్ల నష్టాల్లో వచ్చిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మరి ఇక మిగతా ప్రాంతాల్లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. చెన్నై - బెంగళూరు - విశాఖపట్టణం - తిరుపతిలకు ప్రయాణికులు తగ్గిపోయారు. దీంతో ఆర్టీసీకి పెద్ద సంఖ్యలో ఆదాయం తగ్గిపోయింది. త్వరలోనే బస్సుల సంఖ్య కుదించే అవకాశం ఉంది.