Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్‌: ఇంటికొచ్చిన భర్తపై అనుమానం..

By:  Tupaki Desk   |   30 March 2020 7:30 AM GMT
కరోనా ఎఫెక్ట్‌: ఇంటికొచ్చిన భర్తపై అనుమానం..
X
కరోనా వైరస్‌ పై పట్టణాల కన్నా గ్రామాల్లోనే ప్రజల్లో చైతన్యం బాగా పెరిగింది. అందుకే ఎక్కడికక్కడ కంచెలు వేసుకుని గ్రామ సరిహద్దులను మూసివేసి కొత్త వారిని గ్రామం లోపలకు అనుమతించడం లేదు. గ్రామం నుంచి రాక పోకలు పూర్తిగా నిషేధించారు. ఈ క్రమంలో కొన్ని నవ్వు తెప్పించే సంఘటనలు చోటుచేసుకుంటున్నారు. తాజాగా కర్నూలులో కరోనా పరీక్షలు చేసుకుంటేనే కాపురం చేస్తానని భర్తకు భార్య తేల్చిచెప్పింది.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఓ గ్రామానికి చెందిన వ్యక్తి లారీ డ్రైవర్‌ గా పని చేస్తుంటాడు. వృత్తి రీత్యా లారీలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతుంటాడు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ విధించడం తో తెలంగాణలోని మిర్యాలగూడకు వెళ్లి పని ముగియడంతో ఇటీవల స్వగ్రామం చేరుకున్నాడు. ప్రస్తుతం దేశ, విదేశాల నుంచి వచ్చిన వారిని గ్రామంలోకి అనుమతించని పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్కరిని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో అతడి భార్య భర్తకు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరింది. ఎక్కడెక్కడో తిరుగుతావు.. కరోనా సోకి ఉండవచ్చని.. ఎందుకైనా మంచిది పరీక్షలు చేయించుకోవాలని తెలిపింది. ప్రాథమిక పరీక్షలు చేసుకోవాలని చెప్పింది.

అయితే భర్త నిరాకరించాడు. తనకు ఎలాంటి అనారోగ్యం లేదని, పరీక్షలు అనవసరమని పేర్కొన్నాడు. అయితే దీనిపై వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక చివరకు భార్య పరీక్షలు చేసుకుంటేనే కాపురం చేస్తానని స్పష్టం చేసింది. కరోనా ఉంటే తనకు, పిల్లలకు, మొత్తం గ్రామానికే సోకుతుందని ఆందోళన వ్యక్తం చేసినా భర్త వినలేదు.

దీంతో తన భర్తపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆదోనిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం రెండు వారాల పాటు స్వీయ నిర్బంధం (హోం క్వారంటైన్‌)లో ఉండాలని వైద్యులు సూచించారు. అతడిని వెంటనే క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. ఈ విధంగా కరోనా అనుమానం భార్యాభర్తల మధ్య గొడవకు దారి తీసింది.