Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ :భారీ ఆర్థిక ప్యాకేజీకి కసరత్తు..నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

By:  Tupaki Desk   |   24 March 2020 5:00 PM IST
కరోనా ఎఫెక్ట్ :భారీ ఆర్థిక ప్యాకేజీకి కసరత్తు..నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
X
కరోనా మహమ్మారి దేశాన్ని పట్టిపీడిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికే ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నామని, ఆధార్, పాన్ అనుసంధానం గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నామని ప్రకటించారు. ఆర్థిక ప్యాకేజీపై కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చిందని వివరించారు. ఆర్థిక సంవత్సరం చివరిరోజులు కావడంతో వేగంగా స్పందించాల్సి ఉందని ఆమె తెలిపారు.

2018-19 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్ ల దాఖలుకు 2020 జూన్ 30 గడువు అని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ వ్యవధిలో పన్ను చెల్లింపుల ఆలస్య రుసుం 12 నుంచి 9 శాతానికి తగ్గిస్తున్నట్టు తెలిపారు. అలాగే , టీడీఎస్ జమలో ఆలస్య రుసుం 18 నుంచి 9 శాతానికి తగ్గించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. వివాద్ పే విశ్వాస్ పథకం గడువు జూన్ 30 వరకు పొడిగిస్తున్నామని, పన్ను వివాదం మొత్తాల చెల్లింపుల్లో 10 శాతం అదనపు రుసుం తొలగిస్తున్నట్టు చెప్పారు.

మార్చి, ఏప్రిల్, మే మాసాల జీఎస్టీ రిటర్న్ ల దాఖలు గడువు జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు ఆర్థికమంత్రి వివరించారు. ఆధార్ - పాన్ లింకింగ్ తేదీ ఈ నెల చివరి వరకు ఉంది. కానీ కరోనా మహమ్మారి నేపథ్యంలో దీనిని పొడిగించారు. కాంపోజిషన్ స్కీమ్ రిటర్న్ ల దాఖలుకు కూడా జూన్ 30 వరకు గడువు పెంచామని తెలిపారు. అలాగే ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక ప్యాకేజీని సిద్ధం చేస్తున్నామని, పలు చట్టబద్ద, రెగ్యులేటరీ అంశాలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తామన్నారు. ఐటీ, జీఎస్టీ, కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ఎంసీఏ సహా వివిధ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో మినిమమ్ బ్యాలన్స్ నిబంధన తొలగించడం, ఏ ఏటీఎంలోనైనా నగదు తీసుకునే సౌలభ్యం కల్పించడంతో సామాన్యుడికి ఊరట కలిగించారు అని చెప్పవచ్చు. అలాగే ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే ఉద్దేశం లేదన్న నిర్మలాసీతారామన్... పన్ను చెల్లింపుల్లో వెసులుబాట్లు కల్పిస్తున్నామన్నారు.