Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ : విశాఖలో పిల్లలు ..మలేషియాలో తల్లి !

By:  Tupaki Desk   |   19 March 2020 7:30 AM GMT
కరోనా ఎఫెక్ట్ : విశాఖలో పిల్లలు ..మలేషియాలో తల్లి !
X
కరోనా వైరస్ ...ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ కరోనా దెబ్బకి ప్రతి ఒక్కరు తల్లడిల్లిపోతున్నారు. తమ బిడ్డని తల్లి, తండ్రి తాకాలన్నా కూడా కరోనా భయం వెంబడిస్తుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేస్తుంది. కరోనా ప్రభావంతో ఏడేళ్ల కవల పిల్లలకి ఒక తల్లి గత రెండు వారాలుగా దూరంగా ఉంటుంది. పిల్లల వద్దకి చేరుకోవాలని , వారిని పొత్తిళ్లలో పెట్టుకొని తన్మయం చెందాల్సిన ఆ తల్లేమో దేశం కాని దేశంలో ఉండి, బిడ్డల వద్దకి చేరే మార్గం కనపడక తల్లడిల్లుతోంది. అలాగే గత కొన్ని రోజులుగా అమ్మ స్పర్శకే నోచుకోక ఆ ఏడూ నెలల పిల్లలు అల్లాడిపోతున్నారు. ఆ తల్లి , బిడ్డల ఎడబాటుకి కారణం ..కరోనా !

అదెలా అంటారా ... వీసా రెన్యూవల్‌ కోసం మలేషియా వెళ్లిన ఆమె.. కరోనా నియంత్రణలో భాగంగా ఆ దేశం విధించిన ట్రావెల్‌ బ్యాన్‌ తో అక్కడే చిక్కుకుపోయి.. తనను స్వదేశం పంపించేయాలని కోరుతూ భారత ఎంబసీ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. పూర్తి వివరాలు చూస్తే .. విశాఖపట్నం , శివాజీపాలెం ప్రాంతానికి చెందిన సింధూషకు, విజయ్‌ చంద్రతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. విజయ్‌ మలేషియాలో సాఫ్ట్‌వేర్‌ జాబ్ చేస్తున్నాడు. వివాహమైన తరువాత వారిద్దరూ అక్కడే ఉంటున్నారు. అయితే, గత ఏడాది సింధూష డెలివరీ కోసం విశాఖలో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఏడు నెలల క్రితం ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది.

అయితే, ఇటీవలే ఆమె వీసా రెన్యూవల్ గడువు దగ్గర పడటంతో ...వీసా రెన్యూవల్‌ చేయించుకోకపోతే మళ్లీ భర్త దగ్గరకు వెళ్లడానికి కుదరదు, దీనితో కరోనా ముప్పు ముంచుకొస్తున్న దైర్యం చేసి, విమాన సర్వీసులకు ఎటువంటి అంతరాయం లేకపోవడంతో రెండు వారాల క్రితం మలేషియా వెళ్లింది. వీసా రెన్యూవల్‌ చేయించుకుంది. ఈలోగా ప్రపంచంలో కరోనా ప్రభావం ఎక్కువ అవ్వడంతో మలేషియా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా ట్రావెల్‌ బ్యాన్‌ విధించి, మలేషియా నుంచి విదేశాలకు విమాన సర్వీసులు రద్దు చేసింది. దీనితో ఆమె అక్కడే చిక్కుకుపోయింది. ఏడు నెలల పసికందులైన తన పిల్లలను చూడాలని, భారత ఎంబసీ చుట్టూ తిరుగుతుంటే..ఇక్కడ పిల్లలు తల్లి ప్రేమకు దూరమైయ్యారు. సింధూష కౌలాలంపూర్‌లోని ఇండియన్‌ హైకమిషన్‌ కార్యాలయానికి వెళ్లి తన పరిస్థితి వివరించినప్పటికీ.. అక్కడ ఎవరూ స్పందించకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తన బాధను అర్థం చేసుకొని మలేషియా నుంచి తనను విశాఖకు తీసుకొచ్చేందుకు సహకరించాలని ప్రార్తిస్తుంది.