Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ : ఐపీఎల్ అభిమానులకి షాక్ తప్పదా ..?

By:  Tupaki Desk   |   7 March 2020 1:00 AM IST
కరోనా ఎఫెక్ట్ : ఐపీఎల్ అభిమానులకి షాక్ తప్పదా ..?
X
కరోనా వైరస్ దెబ్బకు ప్రస్తుతం ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రజలు ఈ వైరస్ బారిన పడి పిట్టల్లా నేలరాలుతున్నారు. చైనాలో ఇప్పటికే 3వేల మంది దీని ప్రభావంతో మృతిచెందగా, మరో 80 వేల మంది మంచానపడ్డారు. భారత్‌ లోనూ 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. దీంతో బయటకి రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు.

ఇకపోతే, క్రీడల విషయానికి వస్తే ఒలింపిక్స్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే క్వాలిఫైయింగ్ టోర్నీలు రద్దయ్యాయి. చైనాలో జరగాల్సిన స్పోర్ట్స్ ఈవెంట్స్‌ కూడా రద్దయ్యాయి. అయితే.. క్రికెట్ అభిమానులకు కావాల్సినంత పసందును ఇచ్చే ఐపీఎల్ 2020 టోర్నీ కూడా జరిగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ టోర్నీ రద్దయితే క్రికెట్ అభిమానులకు వేసవిలో మండుటెండే దిక్కు. టోర్నీ జరిగి తీరుతుందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెబుతున్నా... కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టోర్నీ ఎలా సాధ్యమవుతుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో బీసీసీఐ పెద్దలు క్రీడా శాఖ తలుపు తట్టారు. ఈ నెల 29 నుంచి టోర్నీ ప్రారంభం కాబోతున్నందున కరోనా ప్రభావం ఏ విధంగా ఉండనుంది అని ఆరా తీశారు. ఐపీఎల్‌ కు తమ క్రికెటర్లను ఇండియాకు పంపడానికి కివీస్ బోర్డు భయపడుతోంది. ఇదిలా ఉండగా... ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై ఎలాంటి అనుమానం అక్కర్లేదని కొద్దిసేపటి క్రితమే బీసీసీఐ స్పష్టం చేసింది. మార్చి 29న కచ్చితంగా తొలి మ్యాచ్ జరిగి తీరుతుందని బ్రిజేశ్ కుమార్ తేల్చి చెప్పారు.