Begin typing your search above and press return to search.

మోడీ చేయలేని పని 'కరోనా' చేసింది

By:  Tupaki Desk   |   13 April 2020 6:29 PM GMT
మోడీ చేయలేని పని కరోనా చేసింది
X
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, హిందువులకు అత్యంత పవిత్రమైన 'గంగా' నది ప్రక్షాళనపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక శ్రద్ధ వహించిన సంగతి తెలిసిందే. గంగానది ప్రక్షాళనకు నడుం బిగించిన మోడీ..'నమామి గంగా'కు శ్రీకారం చుట్టారు. 'నేషనల్ మిషన్ ఫర్ గంగా క్లీన్(ఎన్ ఎమ్ సీజీ)'ప్రాజెక్టు కోసం దాదాపు 28,790 కోట్ల రూపాయల బడ్జెట్ ను మంజూరు చేశారు. కేంద్ర మంత్రిత్వ శాఖ అయిన జల్ శక్తి ఆధ్వర్యంలో పనిచేస్తోన్న ఎన్ ఎమ్ సీజీ...మార్చి 12నాటికి 37 శాతం పనులు మాత్రమే పూర్తి చేయగలిగింది. 28,790 కోట్ల రూపాయలలో కేవలం 8352.86 కోట్లు మాత్రమే..అంటే మొత్తం బడ్జెట్ లో 29 శాతం మాత్రమే ఖర్చు చేసింది. గంగా నది శుద్ధికి నిర్దేశించిన 310 రివర్ క్లీనింగ్ ప్రాజెక్టులలో 116 మాత్రమే పూర్తయ్యాయి. ప్రధాని మోడీ చెప్పిన ప్రకారం ఎన్ ఎమ్ సీజీ పూర్తి కావడానికి మరో 9 నెలల కాలం మాత్రమే మిగిలి ఉంది.

యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టినా కూడా....ప్రధాని విధించిన డెడ్ లైన్ అయిన డిసెంబరు 2020నాటికి మొత్తం 116 రివర్ క్లీనింగ్ ప్రాజెక్టులు పూర్తి కావడం దాదాపు అసాధ్యం. దీనికి తోడు కరోనా మహమ్మారి కోరలు చాచడంతో గంగానది ప్రక్షాళన అనుకున్న సమయానికి పూర్తి అయ్యే అవకాశాలు కనిపించలేదు. అయితే, అనూహ్యంగా ప్రధాని మోడీ...చేయలేని పనిని కరోనా చేసింది. కరోనా దెబ్బకు కాలుష్యం తగ్గడంతో చాలావరకు గంగానది తనను తానే ప్రక్షాళన చేసుకుంది. కరోనా దెబ్బకు గంగానది 40-50 శాతం ప్రక్షాళన అయిందని శాస్త్రవేత్తలు, పరిశోధకులు చెబుతున్నారు. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలైన వారణాసి, హరిద్వార్ లలో ప్రవహించే గంగానది... కాలుష్యం కోరల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

అయితే, కరోనా దెబ్బకు ఆ ఆలయాలు మూసివేయడంతో గంగా నదికి భక్తుల తాకిడి లేదు. దీనికి తోడు గంగా నదిలోకి హోటళ్లు, పరిశ్రమలు, ఇతరత్రా దుకాణాలు వ్యర్థాలు విడుదల చేయడం లేదు. పరిశ్రమలనుంచి నుంచి వచ్చే ఉద్గారాలు, వ్యర్థ పదార్థాలు గంగా నదిలోకి వెళ్లి కలుస్తుంటాయి. లాక్ డౌన్ పుణ్యమా అంటూ వారణాసి, హరిద్వార్‌ ప్రాంతాల్లో ప్రవహించే గంగా నదిలోకి గత 20 రోజులుగా వ్యర్థాలు చేరడం లేదు. దీంతో, గంగా నదిలోని నీరు దానంతట అదే రోజు రోజుకి శుద్ధి అవుతోంది. దీంతో, ప్రస్తుతం గంగా నదిలో నీరు చాలా శుభ్రంగా కనిపిస్తోందని, నీటి నాణ్యతలో గొప్ప మార్పు కనిపిస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ నీరు తాగడానికి కూడా పనికి వస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఇక, లాక్ డౌన్ నేపథ్యంలో హరిద్వార్‌ ఘాట్లు మూసివేయడంతో ప్రజలు నీటిలో దిగడం, వ్యర్థాలను నీటిలో వేయడం, దైనందిన కార్యక్రమాలకు నీటిని వాడడం వంటివి లేకపోవడంతో నీళ్లు తేటగా కనిపిస్తున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. గంగా నదిలో చేపలు ఇతర సముద్ర జీవులు కూడా స్పష్టంగా కనిపించేంత శుభ్రంగా గంగా నది ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. గంగా నదిలోకి పదోవంతు కాలుష్యం పరిశ్రమలు, సమీప హోటళ్ల నుంచి వెలువడే వ్యర్థాల ద్వారా చేరుతుందని బెనార‌స్ హిందూ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ పీకే మిశ్రా చెబుతున్నారు. గత కొన్ని వారాలుగా గంగా నది పరిసర ప్రాంతాల్లో వర్షపాతం కూడా నమోదవ్వడంతో నీటి మట్టాలు పెరిగాయని చెబుతున్నారు. గంగా నదితోపాటు యమునా నది నీటి నాణ్యత, నీటి పరిమాణంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోందని అంటున్నారు. లాక్ డౌన్ దెబ్బకు రోడ్లపై వాహానాలు తక్కువగా ప్రయాణిస్తుండటంతో వాయు కాలుష్యం లేకపోవడంతో ఇప్పటి వరకు కనిపించని అనేక వలస పక్షులు కూడా తిరిగి వచ్చాయని చెబుతున్నారు. కొన్ని ప్రదేశాల్లో అడవిలో ఉండే జంతువులు కూడా రోడ్లపైకి వస్తున్నాయని అంటున్నారు.

మరి కొద్ది రోజులు లాక్ డౌన్ కొనసాగిస్తే...లేదా పరిశ్రమలు, హోటళ్లు, వారణాసి, హరిద్వార్ ఆలయాలు మూసి ఉంచితే...గంగా నది దాదాపు 80 శాతం శుభ్రమవుతుంది. ఆ తర్వాత అందులో ఉన్న వ్యర్థాలను యంత్రాల సాయంతో, మనుషుల సాయం తో తీసివేస్తే గంగా నది 100 శాతం శుభ్రమై తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. శాస్త్రవేత్తలు ఈనాడు చెప్పడం కాదు...గంగానదిలోకి పరిశ్రమలు, హోటళ్లు, తదితరాలు వ్యర్థాలు విడుదల చేయడం మానివేయడంతో పాటు గంగా నదిలో మునకవేసేందుకు వచ్చే భక్తులు వ్యర్థ పదార్థాలను, ప్లాస్టిక్ కవర్లు, ఇతరత్రా వ్యర్థాలను వదలడం మానేస్తే దానంతట అదే శుభ్రమవుతుందన్నది అక్షర సత్యం. లేదంటే కరోనా...లాక్ డౌన్ పూర్తయిన తర్వాత...యథావిధిగా గంగలో వ్యర్థాలు వదిలితే మరలా గంగానది కలుషితమవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మనుషులంతా కట్టుబాటుతో ఉంటే వేల కోట్లు కుమ్మరించి గంగను శుభ్రం చేయాల్సిన అవసరం ఉందా? గంగానది పరిశుభ్రంగా ఉంటే...అన్ని వేల కోట్ల రూపాయలు వైద్యరంగానికో...మరేదైనా రంగానికో ఉపయోగపడేవి కదా? గంగానదిని ప్రక్షాళన చేయాలంటే కరోనా వంటి విపత్తులు రావాల్సిందేనా? మనుషులంతా కట్టుబాటుతో ఉండి...గంగానదిని పరిశుభ్రంగా ఉంచుకోలేమా? స్టే క్లీన్...అండ్ కీప్ క్లీన్ గంగా!