Begin typing your search above and press return to search.

మహారాష్ట్రలో కల్లోలం.. ఓవైపు కరోనా.. మరోవైపు ఒమిక్రాన్

By:  Tupaki Desk   |   17 Jun 2022 7:30 AM GMT
మహారాష్ట్రలో కల్లోలం.. ఓవైపు కరోనా.. మరోవైపు ఒమిక్రాన్
X
వానాకాలం వచ్చింది. సీజనల్ వ్యాధులు ఇక చుట్టుముట్టేస్తున్నాయి. ఓవైపు సీజనల్ వ్యాధులు మరోవైపు పెరుగుతున్న కరోనా కేసులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో రోజువారీ కేసులు భారీగా నమోదవ్వడం ఆ రాష్ట్రాన్ని మరోసారి లాక్‌డౌన్‌లోకి నెట్టేలా కనిపిస్తోంది. మరోవైపు మహారాష్ట్రలో కొత్తగా రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

భారత్‌లో క్రమంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత రెండు లాక్‌డౌన్‌లో హాట్‌స్పాట్‌గా ఉన్న మహారాష్ట్రలో ఇప్పుడు కూడా భారీగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో గత 24 గంటల్లో కొత్తగా 4,335 మంది కరోనా బారినపడినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహమ్మారి సోకి ముగ్గురు మరణించినట్లు తెలిపింది. దాదాపు నాలుగు నెలల్లో ఇంత అధికంగా కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి అని చెప్పింది.

మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 20వేల మార్కును దాటినట్లు పేర్కొంది. మహారాష్ట్రలో వరసగా రెండో రోజు 4వేలకుపైగా కేసులు నమోదైనట్లు వివరించింది. బుధవారం రోజున రాష్ట్రంలో 4,024 మంది కరోనా బారిన పడినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.

ఓవైపు కరోనాతో మహారాష్ట్ర అల్లాడిపోతోంటే.. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు నమోదవుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక ప్రకారం.. నాగ్‌పూర్‌కు చెందిన ఇద్దరు రోగులు ఒమిక్రాన్ వేరియంట్ బారినపడినట్లు తెలుస్తోంది. బాధితుల్లో ఒకరు పురుషుడు(29), మహిళ(54). వీరితో కలిపి రాష్ట్రంలో మొత్తం బీఏ4, బీఏ5 వేరియంట్ బారిన పడిన వారి సంఖ్య 19కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

దేశ ఆర్థిక రాజధాని.. వాణిజ్య నగరమైన ముంబయిలో తాజాగా 2,336 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు లేని ఏకైక జిల్లాగా నందుర్బార్‌ ఉందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో మొత్తం కేసులు 79,23,697.. తాజా కేసులు 4,255.. మరణాల సంఖ్య 1,47,880.. కోలుకున్న వారి సంఖ్య 77,55,183.. క్రియాశీల కేసులు 20,634 నమోదు కాగా.. ఇప్పటి వరకూ రాష్ట్రం మొత్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు 8,14,72,916.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల నమోదు తగ్గుతున్నా.. కరోనాతో మరణాల సంఖ్య గత ఐదు వారాలుగా 4 శాతం మేర పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.