Begin typing your search above and press return to search.

భారత్ లో భారీగా కరోనా కేసులు.. రికవరీ తక్కువే..!

By:  Tupaki Desk   |   4 Jan 2022 5:30 PM GMT
భారత్ లో భారీగా కరోనా కేసులు.. రికవరీ తక్కువే..!
X
దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కేవలం ఒక్క రోజులోనే సుమారు 37 వేలకు పైగా కేసులు నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. సోమవారం నాడు 33 వేల కేసులు నమోదు కాగా.. మంగళవారం నాడు మరో నాలుగు వేల కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. సుమారు 11 లక్షల 54 వేల మందికి వైరస్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వివరించారు. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో సుమారు 124 మంది కరోనా వైరస్ తో ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య చెప్పుకోదగిన రీతిలో కనిపించడం లేదు. కేంద్ర ప్రకటించిన అధికారిక గణాంకాల ప్రకారం 11 వేలకు పైగా మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది.

కరోనా ప్రబలిన నాటి నుంచి వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య మూడు కోట్ల నలభై మూడు లక్షలు దాటింది.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్ కేసులు సుమారు ఒక లక్ష డెబ్బై ఒకటి వేలకు చేరినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు దేశంలో పాజిటివిటీ రేటు కూడా అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రాల వారీగా చూస్తే ఎక్కువ కేసులు మహారాష్ట్రలో నమోదు అయినట్లు అధికారులు గుర్తించారు. వీటిలో కూడా కేవలం ముంబైలో సుమారు ఎనిమిది వేలకు పైగా కేసులు వచ్చినట్లు కనుగొన్నారు. కొత్తగా వైరస్ నిర్ధారణ అయిన వారిలో సుమారు 90 శాతం మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించలేదని అధికారులు తెలిపారు.

మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో కూడా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా నాలుగు వేల మందిలో వైరస్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతం అయిన గోవాలో కూడా కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో గోవా లో వైరస్ కేసులు భారీగా బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే పాజిటివిటీ రేటు 10 శాతం పైగా నమోదు అయినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. 24 గంటల్లో 192 మందిలో కొత్త వేరియంట్ నిర్ధారణ అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే కొత్త కేసులతో మొత్తం కొత్త వేరియంట్ కేసులు రెండు వేలకు సమీపించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,892గా ఉన్నట్లు స్పష్టం చేశారు. కొత్త వేరియంట్ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో ఉన్నట్లు కేంద్ర గుర్తించింది. ఇవి సుమారు 568 నమోదు అయినట్లు తెలిపింది. తర్వాత స్థానంలో ఢిల్లీ 382 కేసులు ఉన్నట్లు పేర్కొంది.