Begin typing your search above and press return to search.

ఇది తెలుసా.. చైనాతో సరిహద్దు ఉన్నా కరోనా కేసులు సున్నా

By:  Tupaki Desk   |   17 March 2020 3:45 PM IST
ఇది తెలుసా.. చైనాతో సరిహద్దు ఉన్నా కరోనా కేసులు సున్నా
X
భారత్‌లో రోజురోజుకీ తీవ్రమవుతున్న కరోనావైరస్ కొన్ని రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటకల్లో ఎక్కువ పాజిటివ్ కేసులు తేలాయి. అయితే, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కరోనా ప్రభావం కనిపించలేదు. మరీ ముఖ్యంగా చైనాతో నేరుగా సరిహద్దు ఉన్నవి.. చైనాకు సమీపంగా ఉన్న రాష్ట్రాల్లో ఈ వైరస్ వ్యాపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

భారత్‌లోని అయిదు రాష్ట్రాలకు చైనాతో సరిహద్దు ఉంది. పూర్వ జమ్ముకశ్మీర్ రాష్ట్రం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లకు చైనాతో సరిహద్దు ఉంది. ఇవి కాకుండా చైనాకు, మనకు మధ్య ఉన్న చిన్న దేశాలు నేపాల్, భూటాన్‌లతోనూ సరిహద్దులున్నాయి. నేపాల్‌ తో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, సిక్కిం, పశ్చిమబెంగాల్‌ కు... భూటాన్‌ తో బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలకు సరిహద్దు ఉంది. ఇవి కాకుండా చైనాతో సరిహద్దు ఉండి భారత్‌తోనూ సరిహద్దు ఉన్న మరోదేశం మయన్మార్.. మయన్మార్‌ తో మనకు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాంలకు సరిహద్దు ఉంది.

కానీ, ఇలా భూ సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో కొన్నిట్లో మాత్రమే కరోనా కేసులు నమోదయ్యాయి. చైనాతో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో ఒక్క ఉత్తరాఖండ్‌, పాత జమ్ముకశ్మీర్‌లో మాత్రమే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేపాల్ సరిహద్దున్న ఉత్తరాఖండ్‌ లోనూ కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌ లో 12, ఉత్తరాఖండ్‌ లో 1, పాత జమ్ముకశ్మీర్(ప్రస్తుత జమ్ముకశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి) 7 కేసులు నమోదయ్యాయి.

చైనాతో సరిహద్దున్న హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో ఇంతవరకు ఈ వైరస్ జాడలేదు. అలాగే చైనాతో సరిహద్దు ఉన్న దేశాలను ఆనుకుని ఉన్న భారత రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్, అస్సాం, బిహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం వంటి రాష్ట్రాల్లో ఇంతవరకు కరోనా కనిపించలేదు. దీంతో చైనాతో సరిహద్దు ఉన్నంత మాత్రాన ప్రమాదం అనే వాదనకు ఎక్కడా ఆధారాలు లేవని అర్థమవుతోంది. మరోవైపు భారత్‌లోకి మొదట దుబాయి, ఇటలీ నుంచే కరోనా వైరస్ ప్రవేశించిందన్న సంగతి తెలిసిందే. అది కూడా విమానాశ్రయాలకు వచ్చినవారి నుంచే వచ్చింది.