Begin typing your search above and press return to search.

కరోనా కేసుల కల్లోలం.. దేశంలో 4వ వేవ్ తప్పదా?

By:  Tupaki Desk   |   27 Jun 2022 7:41 AM GMT
కరోనా కేసుల కల్లోలం.. దేశంలో 4వ వేవ్ తప్పదా?
X
దేశంలో మరోసారి కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. అయితే ఫస్ట్, సెకండ్ వేవ్ అంత తీవ్రత లేదని చెబుతున్నా మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సోమవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 17,073 కేసులు నమోదు కాగా.. 24 గంటల్లో 21 మంది మరణించారు. దీంతో పాజిటివిటీ రేటు దేశంలో 4.39 శాతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.57 శాతం ఉంది. శనివారంతో పోల్చుకుంటే 45 శాతం కేసులు పెరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడు వేవ్ లు కాగా ప్రస్తుతం 4వ వేవ్ గా పేర్కొంటున్నారు. అయితే ఇది తీవ్రత తక్కువే అని వైద్యులు ప్రకటిస్తున్నా మరణాలు రోజురోజుకు పెరగడం కలకలం రేపుతోంది.

గత రెండు సంవత్సరాలుగా కరోనాతో ప్రజలు విలవిలలాడుతున్నారు. మొదటి, రెండు వేవ్ లో లక్షల కొద్దీ కేసులు నమోదు కాగా.. వేల మంది మరణించారు. ఇప్పటి వరకు దేశంలో 4,34,07,046 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలుపుతోంది. అలాగే మరణాలు 5,25,020 ఉన్నాయి. ఫస్ట్ వేవ్ లో ప్రజలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడంతో కేసులు నమోదైనా మరణాలు సంఖ్య తక్కువగానే ఉన్నాయి. కానీ సెకండ్ వేవ్ లో నిర్లక్ష్యంగా ఉండడం మరణాలు పెరిగాయి. అయితే ఫస్ట్ వేవ్ లో లాక్డైన్ ప్రకటించగా.. సెకండ్ వేవ్లో కేసులు, మరణాలు పెరుగుతుండడంతో అప్రకటిత లాక్డౌన్ విధించారు.

కొన్ని నెలల కిందట సౌతాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ కనుగొనడంతో ఆందోళన చెందారు. అయితే దీని ప్రభావం ఎక్కువగా లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు దాదాపు ప్రతి ఒక్కరు రెండు వ్యాక్సిన్లు తీసుకోవడంతో ధీమాగా ఉన్నారు.

దేశంలో ఇప్పటి వరకు 197,11 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. ఆదివారం ఒక్కరోజే 2,49,646 మందికి కరోనా టీకా అందించారు. దీంతో వ్యాక్సిన్ తీసుకున్న వారు తమకు కరోనా సోకదనే భావనతో కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి కేసుల విజృంభణ కొనసాగుతోందని కొందరు విశ్లేషకులు అంటున్నారు.

కరోనా ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగానే ఉంది. సెకండ్ వేవ్ లో రాష్ట్రంలో చాలా మంది మరణించారు. ఇప్పుడు రూరల్ ప్రాంతాల్లో పెద్దగా లేకున్నా..నగరం, పట్టణాల్లో కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.

అయితే జాగ్రత్తలు పాటించాని వైద్యులు చెబుతున్నా కొందరు నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. ముఖ్యంగా చాలా మంది మాస్క్ ధరించడం మరిచిపోయారని అంటున్నారు. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులకు తోడుగా కరోనా కేసులు పెరుగుతున్నాయని కొందరు అంటున్నారు. ఏదీ ఏమైనా జాగ్రత్తలు పాటించడం ద్వారానే మరోసారి కరోనా కోరల్లో చిక్కకుండా ఉంటామని కొందరు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.