Begin typing your search above and press return to search.

మంగళగిరిలో కరోనా కలకలం...షట్ డౌన్!

By:  Tupaki Desk   |   19 March 2020 8:50 AM GMT
మంగళగిరిలో కరోనా కలకలం...షట్ డౌన్!
X
కరోనా సెగ ఏపీ లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతిని తాకింది. మంగళగిరి లో అమెరికా నుంచి వచ్చిన వృద్ధ దంపతులకు కరోనా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆ దంపతుల లో మహిళకు జలుబు, జ్వరం సోకగ ఫీవర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెకు కరోనా వ్యాధి లక్షణాలు కనిపించడం తో, రక్త నమూనాలను తిరుపతికి పంపించారు. తాజాగా ఆమె భర్త కూడా జలుబు, జ్వరం తో బాధపడుతూ ఉండటంతో ఆయన శాంపిల్ నూ టెస్ట్ లకు పంపించారు. ఈ నేపథ్యంలోనే మంగళగిరిలో కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రకటించారు. టిఫిన్ తోపుడు బండ్లు, చికెన్, మటన్ దుకాణాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లను మూసివేయాలని సూచించారు. మార్చి 31 వరకూ మంగళగిరిలో అన్ని బహిరంగ వ్యాపార సముదాయాలనూ మూసి వేయాలని అధికారుల నుంచి నోటీసులు జారీ అయ్యాయి. తమ ఉత్తర్వులు అతిక్రమిస్తే, కఠిన చర్యలు ఉంటాయని వారు హెచ్చరించారు. ఈ క్రమంలోనే అమరావతిలో నిరసనలను తక్షణం నిలిపివేయాలని, ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు కోరారు.

కరోనా దెబ్బకు ప్రపంచ దేశాల తో పాటు భారత్ లోని పలు రాష్ట్రాలు పాక్షిక షట్ డౌన్ ప్రకటించాయి. భారత్ లోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. ఉన్నతాధికారులతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో తెలంగాణలో 144 సెక్షన్ విధించడం వంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. రాబోయే రెండు వారాలు చాలా కీలకమని రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. తాజాగా ఏపీలో కరోనా అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. రెండో పాజిటివ్ కేసు నమోదు తో పాటు అమరావతిలోని మంగళగిరిలో కరోనా అనుమానితుల నేపథ్యంలో మంగళగిరిని షట్ డౌన్ చేశారు. ఈ నేపథ్యంలో డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ మనీశ్, పలువురు అధికారుల తో సీఎం వైఎస్ జగన్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై జగన్ చర్చించారు. దీంతోపాటు కేంద్ర హోమ్ శాఖకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాసినట్టుగా ప్రచారం జరిగిన లేఖ అంశంపైనా చర్చించారని తెలుస్తోంది.