Begin typing your search above and press return to search.

కాకినాడలో కరోనా భయం ... 'కొరియా టు గోదశివారిపాలెం'

By:  Tupaki Desk   |   5 March 2020 11:45 AM GMT
కాకినాడలో కరోనా భయం ... కొరియా టు గోదశివారిపాలెం
X
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మృతుల సంఖ్య 3,159కి చేరింది. కరోనా వైరస్‌ బారిన పడ్డ వారి సంఖ్య ఇప్పటి వరకు 92,615కు చేరింది. 7,162 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో వైపు 80 దేశాలకు కరోనా వైరస్‌ వ్యాపిచింది. అలాగే తెలుగు రాష్ట్రాలలో రోజురోజుకు కరోనా అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా తూర్పు గోదావరి జిల్లాని గజగజవణికిస్తుంది . తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం వాసికి కరోనా సోకినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నారు. దీనితో జిల్లా స్థాయి అధికారుల నుండి గ్రామ స్థాయి అధికారుల వరకు అందరూ అప్రమత్తమైయ్యారు.

వాడపాలెం గ్రామానికి చెందిన బండారు వెంకటేశ్వర్లు హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కంపెనీ ద్వారా దక్షిణ కొరియాకు ట్రైనింగ్‌కు జనవరి 21న వెళ్లాడు. అతడిని నెల రోజుల పాటు కంపెనీకి రావద్దని, ఇంట్లోనే ఉండమని యాజమాన్యం చెప్పడంతో ఫిబ్రవరి 22న తిరిగి న్యూఢిల్లీ చేరుకుని అక్కడి నుంచి అదేరోజు హైదరాబాద్‌ చేరుకున్నాడు. ఎయిర్‌ పోర్టులో అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి మూడు రోజులపాటు అక్కడే ఉంచుకుని పంపేశారు. హైదరాబాద్‌లో ఉన్న వెంకటేశ్వర్లు గత నెల 28న ట్రావెల్‌ బస్‌లో బయల్దేరి నేరుగా 29న అత్తవారి ఊరు ముమ్మిడివరం మండలం ఠానేల్లంక శివారు గోదశివారిపాలెం గ్రామానికి చేరుకున్నాడు. అదేరోజు పుట్టింటికి వాడపాలెం వచ్చి రెండు రోజులు ఇక్కడే ఉండి మళ్లీ రెండో తేదీన తిరిగి గోదశివారిపాలెం వెళ్లాడు. మంగళవారం అతడికి దగ్గు, జలుబు రావడంతో ఆయన ఎయిర్‌ పోర్టులో తనకు వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్‌ను ఫోన్‌లో సంప్రదించారు.

అయితే వారు కరోనా లక్షణాలు ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు తన స్నేహితుడి ద్వారా కాకినాడలో ఒక వైద్యుడిని సంప్రదించగా అతడు దక్షిణ కొరియా నుంచి రావడం, అక్కడ కరోనా తీవ్రత నేపథ్యం, అనారోగ్య లక్షణాలను బట్టి వెంటనే జీజీహెచ్‌కు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని ఆ వైద్యుడు సూచించినట్టు సమాచారం. అయితే అతను ఆ మేరకు వైద్య పరీక్షలకు వెళ్లకపోవడంతో ఆ వైద్యుడు జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. మంగళవారం రాత్రి ఆ వ్యక్తి కోసం రెవెన్యూ, పోలీస్‌ అధికారులు ఆరా తీసి వాడపాలేనికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

ఈ కరోనా వైరస్‌ అనుమానిత వ్యక్తి గురించి బుధవారం ఉదయానికి వాడపాలెం, గోదాశివారిపాలెం ప్రాంతాల్లో కలకలం రేగింది. డీఎంఅండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ సత్యసుశీల ఆదేశాల మేరకు ఏడీఎం అండ్‌ హెచ్‌ఓ పుష్కరరావు ఆధ్వర్యంలో వానపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ ఎంవీవీఎస్‌ శర్మ అప్రమత్తమయ్యారు. సిబ్బందితో వాడపాలెం చేరుకున్నారు. అనుమానిత వ్యక్తి ఇంట్లో అతడి తల్లితో పాటు ఉంటున్న పెదనాన్న, పెద్దమ్మలను ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు. అలాగే వైరస్‌ అనుమానిత వ్యక్తి ఇంటికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఇంటింటా సర్వే చేపట్టారు. కరోనా వైరస్‌ అనుమానిత వ్యక్తి హైదరాబాద్‌ నుంచి అమలాపురం వరకు ప్రయాణించిన ట్రావెల్‌ బస్‌లోని 40 మంది ప్రయాణికులకు వైద్య పరీక్షలు చేసేందుకు చర్యలు తీసుకున్నామని డీఎంఅండ్‌ హెచ్‌ఓ సత్యసుశీల తెలిపారు. వారందరికీ ఫోన్లు చేశామన్నారు. బుధవారం ఆమె వాడపాలెం చేరుకుని సంబందిత వ్యక్తి ఇంటిని, పరిసరాలను పరిశీలించారు. అలాగే కాకినాడ జీజీహెచ్‌లో ఉన్న అతడిని పరీక్షించగా, వ్యాధి లక్షణాలేమీ లేవని, అయినా రక్త నమూనాలు తీసి పూణె లేబొరేటరీకి పంపించామన్నారు.