Begin typing your search above and press return to search.

కరోనా అటాక్: బ్రిటన్ లో రెండోసారి లాక్ డౌన్

By:  Tupaki Desk   |   1 Nov 2020 5:00 PM IST
కరోనా అటాక్: బ్రిటన్ లో రెండోసారి లాక్ డౌన్
X
శీతాకాలం మొదలు కావడంతో కరోనా విజృంభిస్తుంది. చలి వాతావరణంలో వైరస్ ల వ్యాప్తి, తీవ్రత ఎక్కువగా ఉండడంతో జనాలపై తుఫానులా వైరస్ దాడి చేస్తోంది. దీంతో రోజుకు వేలల్లో కేసులు ఐరోపా దేశాల్లో నమోదవుతున్నాయి.

గురువారం ఫ్రాన్స్ దేశం కరోనా దెబ్బకు డిసెంబర్ 1 వరకు లాక్ డౌన్ విధించగా.. తాజాగా బ్రిటన్ దేశంలోనూ రెండో వేవ్ మొదలైంది. ఆందోళనకర స్థాయిలో వైరస్ వ్యాపిస్తోంది. తొలిసారి కంటే రెండోసారి మరణాల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించడంతో బ్రిటన్ ప్రభుత్వం అప్రమత్తమైంది.

తాజాగా కరోనా మహమ్మారి విస్తృతి దృష్ట్యా కట్టడి చేసేందుకు మరో మార్గం లేదని.. అందుకే దేశంలో రెండోసారి లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఈ కొత్త లాక్ డౌన్ నాలుగు వారాల పాటు విధిస్తున్నట్టు తెలిపారు.

మరో మార్గం తన వద్దలేదని.. ఇదే సరైన సమయం అని.. అందరూ ఇంటికే పరిమితం కావాలని బ్రిటన్ ప్రధాని ప్రజలకు సూచించారు. చదువు, ఇంటి నుంచి పనిచేయాలని.. వీలు కాకపోతే జాగ్రత్తలు, చికిత్స తీసుకొని స్వల్ప సమయం పనిచేయాలని సూచించారు. మందులు, ఆహారం, నిత్యావసరాల కోసం తప్పితే జనాలు బయటకు రావద్దని స్పష్టం చేశారు.

తొలి లాక్ డౌన్ తో పోలిస్తే ఇది అత్యంత కఠినంగా ఉంటుందని.. వ్యాపారాలు, ఉద్యోగులకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలను మరికొన్ని రోజులు పొడిగిస్తామని బ్రిటన్ ప్రధాని తెలిపారు.

బ్రిటన్ దేశంలో కొత్త‌గా 21,915 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 10,11,660కి చేరుకుంది. ఒక్కరోజులోనే 326 మంది క‌రోనా వ‌ల్ల చ‌నిపోయారు.దీంతో బ్రిటన్ ప్రధాని ఉన్న ఫళంగా దేశంలో లాక్ డౌన్ విధించారు.

కాగా ప్ర‌పంచంలో అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న దేశాల్లో బ్రిటన్ తొమ్మిదో స్థానంలో ఉన్న‌ది. అమెరికా, భార‌త్‌, బ్రెజిల్‌, ర‌ష్యా, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, అర్జెంజీనా దేశాలు బ్రిటన్ కంటే ముందున్నాయి.