Begin typing your search above and press return to search.

విజయవాడ కరోనా బాధితుడి సెల్ఫీ వీడియో వైరల్.. దేశంలో 6కు చేరిన మరణాలు.

By:  Tupaki Desk   |   22 March 2020 7:40 AM GMT
విజయవాడ కరోనా బాధితుడి సెల్ఫీ వీడియో వైరల్.. దేశంలో 6కు చేరిన మరణాలు.
X
కరోనా వైరస్ దేశంలో మరణ మృదంగాన్ని వినిపిస్తోంది. వైరస్ విస్తరిస్తూ ప్రాణాలు తీస్తోంది. కరోనా కట్టడికి ప్రధాని ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపునివ్వడంతో అంతా ఇళ్లలోనే ఈరోజు గడుపుతున్నారు.

తాజాగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారానికి ఏకంగా 324కు చేరాయి. వైరస్ బారిన పడి ఇప్పటివరకు దేశంలో ఐదుగురు చనిపోయారు. తాజాగా ఆరో మరణం సంభవించింది. ఫుణెలో చికిత్స పొందుతున్న వ్యక్తి కరోనా కారణంగా మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఫుణెకు చెందిన 38 ఏళ్ల వ్యక్తి ఇటీవలే ఖతార్ దేశం నుంచి ఇండియాకు వచ్చాడు. కరోనా వైరస్ లక్షణాలతో చికిత్స తీసుకుంటున్నారు. బీహార్ లోని పాట్నాలోని ఎయిమ్స్ లో పరిస్థితి విషమించి చనిపోయాడు. అయితే కరోనా కంటే కూడా ఈ వ్యక్తికి కిడ్నీ సమస్యలున్నాయని వైద్యులు తెలిపారు. కరోనా సోకడం.. కిడ్నీ ఫెయిల్ కావడంతోనే చనిపోయాడని తెలిపారు. మాంగెర్ కు చెందిన ఇతడికి కరోనా పాజిటివ్ అని తెలియడంతో రెండు రోజుల కిందటే కోల్ కతా నుంచి పాట్నా వచ్చాడు. ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కరోనాతోపాటు కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా చనిపోయాడు.

ఇక అంతకుముందే ముంబైకి చెందిన 63 ఏళ్ల ఓ ముసలాయన కూడా కరోనా వల్ల చనిపోయాడు. ముంబైలో మార్చి 19న ఈ వృద్ధుడు ఆస్పత్రిలో చేరగా.. మార్చి 21న చనిపోయాడు. అయితే ఇతడికి అప్పటికే షుగర్, బీపీ వ్యాధులు ఉండడంతోపాటు గుండెకు ఇస్కెమిక్ వ్యాధి కూడా ఉంది. ఇన్ని వ్యాధులతో బాధపడుతున్న ఇతడికి కరోనా కూడా సోకడంతో ఊపిరి పీల్చుకోలేక చనిపోయాడు. దీన్ని బట్టి తాజాగా చోటుచేసుకున్న రెండు మరణాల్లో వ్యక్తిగత జబ్బుల కారణమే ప్రధానంగా కనిపిస్తోంది. వారికి కరోనా సోకడంతో వ్యాధులు తీవ్రమై చనిపోయారు.

వీరిద్దరిని కలుపుకుంటే అధికారికంగా దేశంలో కరోనా మరణాల సంఖ్య ఆరుకు చేరింది. కర్ణాటక, ఢిల్లీ, ముంబై, పంజాబ్ లలో ఒక్కరొక్కరు కరోనా పాజిటివ్ తో చనిపోయారు. జైపూర్ లో మరొకరు మరణించారు.

కరోనా సోకి ప్యారిస్ నుంచి వచ్చిన ఏపీలోని విజయవాడకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అతడిని, అతడి కుటుంబాన్ని వెలివేశారని తెలిసింది. ఇక సోషల్ మీడియాలో కరోనా సోకిన విద్యార్థి గురించి దారుణంగా కామెంట్స్ చేయడంతో తాజాగా సెల్ఫీ వీడియోలో విద్యార్థి స్పందించాడు. ప్రస్తుతం ఇతడు విజయవాడలోని ఆస్పత్రిలో ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నాడు.

ఢిల్లీలో ఈనెల 16న దిగినప్పుడు తనకు స్క్రీనింగ్ తీశారని.. అయితే అప్పుడు కరోనా బయటపడలేదని హైదరాబాద్ పంపించారని కరోనా బాధితుడు తెలిపాడు. మున్సిపల్ అధికారుల సూచనతో 14రోజులు ఇంట్లోనే ఉన్నానని.. లక్షణాలు కనిపించడంతో వైద్యులను సంప్రదించి టెస్ట్ చేయించుకున్నానని.. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపారు. నన్ను సపోర్టు చేయండని.. నన్ను, నా కుటుంబాన్ని వెలివేసినట్టు చూడవద్దని.. కామెంట్స్ చేయవద్దని సదురు కరోనా బాధిత విద్యార్థి సెల్ఫీలో వాపోయాడు. తనను బలాన్ని ఇస్తే తాను కరోనాను జయించి బయటకు వస్తానని వివరించాడు. ఇలా కరోనా బాధిత విద్యార్థి తీసుకున్న వీడియో వైరల్ గా మారింది.