Begin typing your search above and press return to search.

ఘోర రైలు ప్ర‌మాదంలో 50మంది మృతి..300 మందికి గాయాలు

By:  Tupaki Desk   |   2 Jun 2023 11:00 PM GMT
ఘోర రైలు ప్ర‌మాదంలో 50మంది మృతి..300 మందికి గాయాలు
X
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘోర ప్ర‌మాదానికి గురైంది. కోర‌మండ‌ల్- యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్ ప్రెస్ తో ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో సుమారు 50 మంది ప్రయాణికులు మరణించారు. 350 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. కోర‌మండ‌ల్ ప‌ట్టాలు త‌ప్ప‌డంతో ఈ పెను ప్ర‌మాదం సంభ‌వించిన‌ట్టు రైల్వే అధికారులు నివేదిస్తున్నారు.

``నేటి (2జూన్) సాయంత్రం 7 గంటల సమయంలో షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ 10-12 కోచ్ లు బాలేశ్వర్ సమీపంలో పట్టాలు తప్పాయి. ఎదురుగా ఉన్న ట్రాక్ పై పడిపోయాయి. కొంత సమయం తరువాత యశ్వంత్ పూర్ నుండి హౌరాకు వెళ్లే మరో రైలు పట్టాలు తప్పిన కోచ్ లలోకి దూసుకెళ్లింది, ఫలితంగా దాని 3-4 కోచ్ లు పట్టాలు తప్పాయి`` అని రైల్వే ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ- తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ ఘోర దుర్ఘ‌ట‌న‌లో మ‌ర‌ణించిన కుటుంబాల‌కు తమ సంతాపాన్ని తెలియజేసారు. సహాయక చర్యలలో భాగంగా ప్ర‌మాద స్థలికి బృందాలను పంపారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రమాద స్థలానికి చేరుకోవాలని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ సత్యబ్రత సాహూ- రెవెన్యూ మంత్రి ప్రమీలా మాలిక్ లను ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.

యాక్సిడెంట్ రిలీఫ్ రైళ్లను ఘటనా స్థలానికి పంపినట్లు సౌత్ ఈస్టర్న్ రైల్వే అధికారి తెలిపారు. ఒడిశా డిజాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ODRAF)కు చెందిన నాలుగు యూనిట్లు.. NDRF మూడు యూనిట్లు .. 60 అంబులెన్స్‌లు క్షతగాత్రులను రక్షించే పనిలో ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఒడిశా ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్ 06782-262286ను జారీ చేసింది. రైల్వే హెల్ప్ లైన్ లు: 033-26382217 (హౌరా)- 8972073925 (ఖరగ్‌పూర్)- 8249591559 (బాలాసోర్) .. 044- 25330952 (చెన్నై).