Begin typing your search above and press return to search.

ఎస్సైపై గ్రామస్థుల థర్డ్ డిగ్రీ

By:  Tupaki Desk   |   2 Aug 2018 9:45 AM IST
ఎస్సైపై గ్రామస్థుల థర్డ్ డిగ్రీ
X
ఒక ఊరు ఊరంతా కదిలొచ్చి పోలీసు స్టేషన్‌ పై దాడి చేసి ఎస్సైని - కానిస్టేబుల్‌ ను చితకబాదిన సంఘటన దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

నెల్లూరు జిల్లా రాపూర్‌ లో డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ రమేష్ అనే యువకుడిని పోలీసులు కొట్టడంపై అతని బంధువులు ఇలా తిరగబడ్డారు. పోలీస్ స్టేషన్ పై దాడి చేసి... అక్కడున్న ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్ల పైనా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రాణభయంతో సెల్ లో దాక్కున్న ఎస్ ఐను బయటకు లాక్కొచ్చి మరీ దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ ఎస్సై - కానిస్టేబుళ్లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గ్రామస్థులంతా మూకుమ్మడిగా స్టేషన్ మీద దాడి చేయడంతో భయకంపితుడైన ఎస్సై ప్రాణ రక్షణ కోసం సెల్ లోపలికి వెళ్లి దాకున్నాడు. అయినప్పటికీ జనాలు వదలకుండా బయటకు లాక్కొచ్చి మరీ కొట్టడం వీడియోల్లో కనిపిస్తోంది. చెప్పులు - కుర్చీలతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో గ్రామానికి చెందిన మహిళలు - చిన్నారులు కూడా ఉన్నారు.

డ్రంకైన్ డ్రైవ్‌ లో దొరికాక పోలీసులు తనను కొట్టడాన్ని అవమానంగా భావించిన రమేష్ - ఈ విషయాన్ని తమ బంధువులకు - స్నేహితులకు - గ్రామస్తులకు చెప్పడంతో వాళ్లందరూ కలిసి స్టేషన్ పై దాడికి పాల్పడ్డారని సమాచారం. సుమారు మూడు వందల మందికి పైగా స్టేషన్ పై దాడి చేసి బీభత్సం సృష్టించారు.