Begin typing your search above and press return to search.

పోలీస్ ట్రైనింగ్లో వంట చేయటం.. బట్టలు ఉతకటం కూడా

By:  Tupaki Desk   |   15 May 2020 7:00 PM IST
పోలీస్ ట్రైనింగ్లో వంట చేయటం.. బట్టలు ఉతకటం కూడా
X
ప్రపంచాన్ని సంపూర్ణంగా ప్రభావితం చేస్తున్న మాయదారి రోగం.. ఇప్పుడు మరిన్ని అంశాల మీద తన ముద్ర పడేలా చేస్తోంది. రానున్న రోజుల్లో 2020కు ముందు.. తర్వాత అన్న మాట ప్రతి రంగంలోనూ.. ప్రతి విషయంలోనూ ప్రస్తావనకు రావటం ఖాయమని చెప్పక తప్పదు. తాజాగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో పోలీసు ట్రైనింగ్ విషయంలో కొత్త పాఠ్యాంశాల్ని చేర్చారు. వినేందుకు విచిత్రంగా అనిపించినా.. ఆ కొత్త పాఠ్యాంశాలు ఏమిటో తెలుసా?

వంట చేయటం.. బట్టలు ఉతకటం. పోలీసు ట్రైనింగ్ కు.. వంట.. బట్టలు ఉతకటానికి లింకేమిటన్న సందేహం కలగొచ్చు. కానీ.. పోలీసు ఉన్నతాధికారుల మాటలు వింటే.. వారి మాటలోనూ వాస్తవం ఉందన్న భావన కలుగక మానదు. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో తెలంగాణ పోలీస్ అకాడమీలో వంట చేసే వారు.. బట్టలు ఉతికే వారు.. సఫాయి కార్మికులు రావట్లేదు. దీంతో.. ట్రైనింగ్ పొందుతున్న వారు తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతున్నారు.

ఈ నేపథ్యంలో ట్రైనీలకు వంట.. బట్టలు ఉతకటం తో పాటు.. బాత్రూంలు శుభ్రం చేసే పనులు చేయించటం ద్వారా..ఎలాంటి పరిస్థితుల్లో అయినా బతికేందుకు వీలుగా సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో 1300 మంది ఎస్ ఐలు.. 650 మంది మహిళా కానిస్టేబుళ్లు పని చేస్తున్నారు. వంట వాళ్లు రాకపోవటంతో వారందరికి తాజాగా వంట చేయటం ఎలా అన్న శిక్షణ ఇచ్చారు. దీనికి మంచి స్పందన వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో.. రానున్న రోజుల్లో పోలీస్ ట్రైనింగ్ లో వంట చేయటం.. బట్టలు ఉతకటం.. బాత్రూంలు శుభ్రంగా ఉంచుకోవటం లాంటి విషయాల్ని బోధించటం తప్పనిసరి చేయనున్నట్లు చెబుతున్నారు. ఇదంతా చూస్తే.. రానున్న రోజుల్లో మరెన్ని మార్పులు చూడాల్సి వస్తుందో కదూ?