Begin typing your search above and press return to search.

ఒలంపిక్స్ లో మహిళా అథ్లెట్స్ దుస్తులపై ఎందుకీ వివాదం !

By:  Tupaki Desk   |   31 July 2021 1:30 PM GMT
ఒలంపిక్స్ లో మహిళా అథ్లెట్స్ దుస్తులపై ఎందుకీ వివాదం !
X
గతంలో జరిగిన విధంగానే టోక్యో ఒలింపిక్స్‌ లో కూడా మహిళా అథ్లెట్స్ దుస్తుల పై వివాదం కొనసాగుతుంది. గతంలో ఎన్నో ఒలంపిక్స్ లో ఈ వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ టోక్యో ఒలింపిక్స్‌ లో పాల్గొంటున్న జర్మన్ మహిళల జిమ్నాస్టిక్ బృందం, సాధారణంగా వేసుకునే బికినీ టైపు లియోటార్డ్ దుస్తులు కాకుండా, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే యూనిటార్డ్ దుస్తులు ధరించాలని నిర్ణయించుకుంది. పూర్తి సూట్లు ధరించడమే తమకు సౌకర్యంగా ఉందని, పురుషుల్లాగే తమకు కూడా నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉండాలనేది వారి వాదన. అంతర్జాతీయ క్రీడల్లో సాధారణంగా మహిళా క్రీడాకారులు బాగా పొట్టిగా, బిగుతుగా ఉండే దుస్తులే ధరిస్తుంటారు. కానీ, పురుషుల దుస్తుల విషయంలో అలా కాదు. వారికి ఎలాంటి నియమాలూ వర్తించవు.

ఇప్పటివరకూ ఇలాంటిది జరగలేదుగానీ, ఒకవేళ టెన్నిస్ ఆడే మహిళలు స్కర్టులు కాకుండా పురుషుల్లా పొడవైన షార్ట్స్ ధరించి ఆడాలని నిర్ణయించుకుంటే ఎలాంటి వివాదాలు పుట్టుకొస్తాయో ఊహించలేం.ఆట నియమాలు ఏర్పరిచేవాళ్లు, మార్కెట్ కూడా మహిళా క్రీడాకారుల ఆటతో పాటు వారి శరీరాలకు కూడా ప్రాధాన్యాన్ని కట్టబెట్టారు. ఆటల్లోకి అడుగుపెట్టిన మహిళలు శారీరక కోమలత్వం, సున్నితత్వాలను పక్కనపెట్టి పురుషుల్లాగే కఠోర శ్రమ చేస్తారు. శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకుంటారు. అయినప్పటికీ, స్త్రీ అంటే ఆకర్షణే. ఇది చాలా విచారకరమైన ఆలోచన. పోనీ, ఆకర్షణీయంగా కనిపిస్తే, ఆట నుంచి దృష్టి మరల్చే ప్రయత్నాలని మళ్లీ వాళ్లనే నిందిస్తారు.

వినేశ్ ఫోగట్ అక్క గీతా ఫోగట్ గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మహిళా క్రీడాకారులపై ఎలాంటి వివక్ష ఉంటుందో వివరించారు. ఒక అమ్మాయి వల్ల ఏదైనా పొరపాటు జరిగినా, లేదా ఓ అబ్బాయితో స్నేహం చేసినా అమ్మాయి తల్లిదండ్రులను నిందిస్తారు. ఆటలని, పాటలని అమ్మాయిలను బయటకు పంపితే వాళ్లు అలాగే తయారవుతారని దుర్భాషలాడతారు. మహిళా క్రీడాకారులు అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తే వారికి సత్ప్రవర్తన లేదని తీర్పులిచ్చేస్తారు అని ఆమె అన్నారు. 2017లో, భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ తన స్నేహితులతో కలిసి తీసుకున్న సెల్ఫీ ఒకటి ట్విట్టర్‌ లో పోస్ట్ చేశారు. అందులో ఆమె స్లీవ్‌ లెస్ టాప్ వేసుకున్నారు. ఆ ఫొటోపై వచ్చిన విమర్శలు ఇన్నీ అన్నీ కావు. ట్విట్టర్‌ లో విపరీతంగా ట్రోల్ చేశారు. మీడియాలో ఆమె గురించి ప్రచురించిన కథనాల హెడ్‌ లైన్‌ లలో 'పోర్న్ స్టార్', 'ఇన్‌ డీసెంట్', 'ఇనెప్రోప్రియేట్' లాంటి పదాలు కూడా వాడారు.

క్రీడా ప్రపంచంలో, మైదానంలో కానివ్వండి, బయట కానివ్వండి.. మోడరన్, ఫార్వర్డ్ లాంటి బిరుదలన్నీ మహిళలకే ఇస్తారు. వారు వేసుకునే బట్టలపైనే సవాళ్లు తలెత్తుతాయి. 18 ఏళ్ల వయసులోనే భారతదేశానికి ఖ్యాతి తెచ్చిపెట్టిన టెన్నిస్ స్టార్ సానియా మిర్జా దుస్తులపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె సభ్య సమాజం నియమాలను ఉల్లంఘించారంటూ ఆరోపించారు. ఆమెపై ఫత్వా జారీ చేస్తూ, మహిళలు పొట్టి బట్టలు వేసుకోవడాన్ని ఇస్లాం అనుమతించదని, సానియా మిర్జా వేసుకున్న బట్టలు చాలావరకు తన శరీర భాగాలను కప్పి ఉంచట్లేదని, దానివల్ల ఊహకు ఇంకేం మిగలడం లేదని వ్యాఖ్యానించారు. అయితే, ఈ ఫత్వాపై స్పందించడానికి సానియా నిరాకరించారు. తాను వేసుకునే దుస్తులపై ఎన్నో వివాదాలు ఉన్నాయని, అవన్నీ తన మనసును బాధపెడతాయని అన్నారు.

పురుషాధిక్య ప్రపంచంలో పొట్టి బట్టలేసుకుని ఆడే మహిళా క్రీడాకారులు అవైలబుల్ గా ఉంటారని భావిస్తుంటారు. భద్రత కల్పించవలసిన శిక్షణ కేంద్రాలు, కోచ్‌లు కూడ వారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతుంటారు. కానీ, ఆ విషయాలు బయటకు చెప్తే ఎక్కడ ఆడే అవకాశాలు పోగొట్టుకుంటామో అని మహిళా క్రీడాకారులు భయపడుతుంటారు. మొదటే క్రీడల్లో మహిళలకు అవకాశాలు తక్కువ, ఆపై ఇలాంటి వాటి గురించి బయటకు చెప్తే ఇంక అసలు ఆడనివ్వరేమోననే భయం ఉంటుంది. మహిళా క్రీడాకారులను ఆకర్షణ అనే చట్రం నుంచే చూడడానికి, వారిపై లైంగిక హింసకు దగ్గర సంబంధం ఉంది. టోక్యో ఒలింపిక్స్‌కు ముందే, ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన యూరోపియన్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్‌ షిప్‌ లో జర్మన్ జిమ్నాస్టిక్స్ జట్టు తొలిసారిగా యూనిటార్డ్ ధరించి, మహిళా క్రీడాకారుల దుస్తులపై చూపుతున్న వివక్షకు నిరసన వ్యక్తం చేసింది.

జిమ్నాస్టిక్స్‌ లో మహిళల 'సెక్సువలైజేషన్ ', లైంగిక హింసను అడ్డుకోవడానికి ఈ రకమైన నిరసన అవసరమని జర్మన్ ఫెడరేషన్ పేర్కొంది.జిమ్నాస్టిక్ క్రీడల ప్రపంచంలో లైంగిక హింసకు తాజా ఉదాహరణగా అమెరికా మహిళల టీమ్ డాక్టర్ లారీ నాసర్ కేసు గురించి చెప్పుకోవచ్చు. 150 మంది మహిళా క్రీడాకారులను లైంగికంగా వేధించారన్న ఆరోపపణలతో నాసర్‌ కు 175 సంవత్సరాల జైలు శిక్ష పడింది. గత వారం నార్వే మహిళల బీచ్-హ్యాండ్‌బాల్ జట్టు తమ సౌకర్యం కోసం బికినీ షార్ట్స్ కాకుండా నిక్కర్లు వేసుకోవాలని నిర్ణయించుకుంది. ఫలితంగా, వారు నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. క్రీడా దుస్తుల నియమాన్ని ఉల్లంఘించారంటూ వారికి జరిమానా విధించారు.