Begin typing your search above and press return to search.

ఏపీ ఉప ముఖ్యమంత్రి కులం పై వివాదం

By:  Tupaki Desk   |   10 Jun 2019 8:40 AM GMT
ఏపీ ఉప ముఖ్యమంత్రి కులం పై వివాదం
X
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి - విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి కుల వివాదం రాజుకుంటోంది. ఆమె ఎస్టీ కాదని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పల నర్స ఆరోపించారు. ఆమె కులానికి సంబంధించిన కేసు కోర్టు విచారణలో ఉందని - అటువంటప్పుడు ఆమెను ఎస్టీగా పరిగణిస్తూ - మంత్రివర్గంలోకి తీసుకుని - గిరిజన సంక్షేమ శాఖను ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. అరకులో మీడియాతో మాట్లాడిన ఆయన, పుష్ప శ్రీవాణి సోదరి రామ తులసి ఎస్టీ కాదని గతంలో అధికారులు ధ్రువీకరించారని - ఈ నేపథ్యంలోనే ఆమె తన ఉపాధ్యాయ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారని గుర్తు చేశారు. సోదరి రామతులసి ఎస్టీ కానప్పుడు పుష్పశ్రీవాణి ఎస్టీ ఎలా అవుతుందని ప్రశ్నించారు.

శ్రీవాణి తొలిసారి గెలిచినప్పుడే కోర్టులో కేసు దాఖలైందని - అది ఇంకా విచారణలో ఉండగానే - రెండోసారి ఆమెకు టికెట్‌ ఇచ్చారని అప్పలనర్స అన్నారు. గెలిచిన ఆమెకు డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖలను ఎలా ఇస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

కాగా ఆమె మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా స్థానిక గిరిజన సంఘాలు ఇదే ఆరోపణ చేశాయి. పుష్ప శ్రీవాణి కులంపై విచారణ జరపాలని అప్పట్లో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ డిమాండ్ చేశారు. బినామీ గిరిజనుల మూలంగా అసలైన గిరిజనులకు అన్యాయం జరుగుతుందని గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీకి నిలబడే అభ్యర్థులు తాజాగా తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలనే నిబంధన ఉన్నా పుష్పశ్రీవాణి 2013లో తీసుకున్న ధ్రువీకరణ పత్రాన్నే నామినేషన్‌ సమయంలో సమర్పించారని ఆయన నామినేషన్ల సమయంలో ఆరోపించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి దానిని ఏ విధంగా ఆమోదించారని ప్రశ్నించారు. పుష్పశ్రీవాణి సోదరి పాముల రామతులసి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన అనంతరం.. ఆమె ఎస్‌టి కాదని అప్పటిలో పార్వతిపురం ఐటీడీఏ పీవో విచారణ చేసి నిర్ధారించారని గాంధీ కూడా ఆరోపించారు.

ఇప్పుడు గిరిజన సంఘాలకు చెందిన ఇతర నేతలూ ఇవే ఆరోపణలు చేస్తుండడంతో జగన్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలోనూ విజయనగరం జిల్లాకు చెందిన ఎస్టీ నేతలపై కుల వివాదాలున్నప్పటికీ వారెవరూ ఉప ముఖ్యమంత్రి స్థాయి హోదాల్లో లేరు. కురుపాం నుంచే గతంలో పోటీ చేసి.. మొన్నటి ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి బరిలో దిగేందుకు నామినేషన్ వేసిన జనార్థన్ థాట్రాజ్ నామినేషన్ కూడా కుల వివాదం కారణంగానే రద్దయింది. దాంతో ఆయన తల్లి నామినేషన్ వేశారు. ఆమె కులంపైనా వివాదం ఉంది. అలాగే.. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు.. మాజీ కేంద్ర మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ - మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి వంటివారూ ఎస్టీలు కారంటూ వివాదాలున్నాయి.