Begin typing your search above and press return to search.

‘‘ప్రత్యేక హోదా’’ రాష్ట్ర సీఎం షాకింగ్ వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   25 Sep 2016 5:16 AM GMT
‘‘ప్రత్యేక హోదా’’ రాష్ట్ర సీఎం షాకింగ్ వ్యాఖ్యలు
X
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో మాట ఇవ్వటం, సాంకేతిక కారణాల సాకుతో చట్టంలో దానిని చేర్చకపోవటం తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కాంగ్రెస్ కంటే తాము రెండు ఆకులు ఎక్కువ చదివినట్లుగా నాడు మాటలు చెప్పిన బీజేపీ నేతలు మోడీ సర్కారు ఢిల్లీ గద్దె మీద కొలువు తీరిన నాటి నుంచి వారి టోన్ లో మార్పు వచ్చేసింది. హోదా ఇష్యూను దాదాపు రెండున్నరేళ్ల పాటు నానబెట్టి..నానబెట్టి.. చివరకు నో హోదా ఓన్లీ ప్యాకేజీ అంటూ ఆ మధ్య తేల్చేశారు. దీనిపై సీమాంధ్రులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. విభజన సందర్భంగా తాము ఎంతటి అన్యాయానికి గురయ్యామని ఫీల్ అయ్యారో.. అంతే అన్యాయం తమకు మరోసారి జరిగిందని హోదా ఇష్యూలో హ్యాండ్ ఇవ్వటంపై వారి వాపోతున్నారు.

ఇదిలా ఉంటే.. చట్టబద్ధంగా ప్రత్యేక హోదా కలిగి ఉన్న త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తాజాగా ‘హోదా’ ఇష్యూ మీద నోరు విప్పారు. ప్రత్యేక హోదాతో ఎంతో ప్రయోజనం ఉంటుందన్న చర్చ సాగుతున్న వేళ.. తాజాగా ఆయనిచ్చిన ఒక ఇంటర్వ్యూలో హోదాతో ఏమీ ఒరగదన్న విషయాన్ని చెప్పటం విశేషం. ప్రత్యేక హోదాకు ఎన్డీయే సర్కారు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదని.. హోదా వల్ల వచ్చే నిధులను కుదించిన విషయాన్ని చెప్పుకొచ్చారు. హోదాతో నిధుల వరద పారుతుందన్న మాటల్లో నిజం లేదన్నట్లుగా మాణిక్ సర్కారు మాటలు ఉండటం గమనార్హం.

త్రిపుర ఒక్కటే కాదు.. ఈశాన్య రాష్ట్రాలన్నీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నట్లుగా చెప్పిన మాణిక్.. దీనంతటికి మోడీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని చెప్పారు. ప్రత్యేక హోదాను ఉపసంహరించుకుంటున్నామని ప్రధాని ప్రకటించకున్నా.. ఇప్పటికే హోదా ప్రయోజనాలేవీ అమలులో లేవని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘గతంలో ప్రణాళికా సంఘం - ఆర్థిక సంఘం ద్వారా మాకు అనేక నిధులు వచ్చేవి. వాటిల్లో కొన్నింటిని తగ్గిస్తే.. మరికొన్నింటిని ఉపసంహరించుకున్నారు. కానీ.. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులతో కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతం పెంచినట్లుగా చెబుతున్నారు. కానీ.. ఇందులో చాలా మతలబులు ఉన్నాయి. 13వ ఆర్థిక సంఘం సిఫార్సులతో త్రిపురకు ఏడాదికి రూ.500 కోట్లు వచ్చేవి. ఇప్పుడు వాటిని నిలిపివేశారు. ప్రత్యేక హోదా వల్ల మాకు రూ.2500 కోట్లు వచ్చేవి. ఇప్పుడీ నిధులన్నీ కలిసిపోయాయి. అనేక కేంద్ర ప్రభుత్వ పథకాల్ని ఉపసంహరించుకున్నారు. హోదా ఉన్నా లేకున్నా కేంద్రం సహకారం లేకపోతే రాష్ట్రాలకు నిధులు విడుదల కావటం కష్టమే. మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కేంద్రం సాయం చేస్తోంది’’ అని అసలు విషయాన్ని చెప్పేశారు. మాణిక్ సర్కారు మాటలు విన్నప్పుడు అనిపించేది ఒక్కటే.. హోదా ఉన్నా లేకున్నా కేంద్రంతో సఖ్యతగా ఉండి వారి మనసులు గెలుచుకుంటూ నాలుగురాళ్లు తెచ్చుకోవటమే తప్పించి.. మరో మార్గం లేదని. అంతకు మించి ఏం చేసినా ప్రయోజనం శూన్యమన్నట్లుగా త్రిపుర సీఎం మాటలు తేల్చి చెబుతున్నాయని చెప్పక తప్పదు.