Begin typing your search above and press return to search.

వివాదాస్పద బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం..! అరవింద్​ కేజ్రీవాల్​ ఫైర్​..!

By:  Tupaki Desk   |   25 March 2021 6:30 AM GMT
వివాదాస్పద బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం..! అరవింద్​ కేజ్రీవాల్​ ఫైర్​..!
X
ఢిల్లీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అరవింద్​ కేజ్రీవాల్​ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ వివాదాస్పద బిల్లును తీసుకొచ్చింది. ఆ బిల్లు ఏమిటంటే లెఫ్టినెంట్​ గవర్నర్​కు విశేష అధికారాలు కట్టబెట్టడం. అంటే ఇక నుంచి ఢిల్లీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. దాన్ని లెఫ్టినెంట్​ గవర్నర్ ఆమోదించాలి. అప్పుడు ఆ నిర్ణయం కార్యరూపం దాల్చుతుంది. అంటే ఓ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రికి అధికారాలకు కోత పెట్టడమే. నిజానికి కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకు లెఫ్ట్​నెంట్​ గవర్నర్​ ఉంటారు. మామూలు గవర్నర్ల కంటే లెఫ్టినెంట్ గవర్నర్లకు విశేష అధికారాలు ఉంటాయి.

అయితే ఢిల్లీకి కూడా గతంలో లెఫ్టినెంట్​ గవర్నర్​ ఉండేవారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి పూర్తిస్థాయి అధికారాలు కట్టబెడుతూ మామూలు రాష్ట్రంగా చేసింది. కానీ ప్రస్తుతం మళ్లీ లెఫ్టినెంట్​ గవర్నర్​కు అధికారాలు కట్టబెట్టారు. ఈ బిల్లు ఇప్పటికే లోక్​సభలో ఆమోదం పొందగా..రాజ్యసభలోనూ నిన్న ఆమోదం పొందింది. ప్రతి పక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపినప్పటికీ రాజ్యసభలో ఈ బిల్లుకు ఆమోదం దక్కింది. ఇక రాష్ట్రపతి ఆమోదం తెలిపితే ఈ బిల్లు కార్యరూపం దాల్చుతున్నది. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఢిల్లీ ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అని నిర్వచించే ‘ది గవర్న్‌మెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ (సవరణ) బిల్లు -2021’ మార్చి 22న లోక్‌సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడంతో రాష్ట్రపతి ఆమోదం పొందితే ఇక ఢిల్లీ సీఎం అధికారాలకు కోత పడనున్నది. ఈ బిల్లును సెలెక్ట్​ కమిటీకి పంపించాలంటూ విపక్షాలు డిమాండ్​ చేశాయి. మరోవైపు కాంగ్రెస్‌ బీజేడీ, సమాజ్‌వాదీ పార్టీ, వైఎస్ఆర్సీపీ సహా పలు విపక్ష పార్టీలు వాకౌట్ చేశాయి.
ఈ బిల్లును ఆమ్​ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది.

‘మహాభారతంలో ద్రౌపదికి జరిగిన అవమానం.. నేడు ప్రజాస్వామ్యానికి జరిగింది’ అంటూ ఆ పార్టీ నేత సంజయ్​ సింగ్​ విమర్శించారు. పేదలకు ఉచితంగా మంచి విద్య నందించడం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్​ ఇవ్వడం, మొహల్లా క్లినిక్​లు ఏర్పాటు చేయడం తాము చేసిన తప్పా అంటూ ఆయన నిలదీశారు.

అరవింద్​ కేజ్రీవాల్​ ఈ బిల్లు ఆమోదం పొందడంపై ట్విట్టర్​ వేదికగా స్పందించారు. ‘ ప్రజాస్వామ్యానికి ఇది దుర్ధినం. అయినప్పటికీ మాకు ప్రజల మద్దతు ఉంది. మా రాజీలేని పోరాటాలు కొనసాగిస్తాం’ అంటూ ఆయన ట్వీట్​ చేశారు.