Begin typing your search above and press return to search.

రఘురామపై రాజద్రోహం కేసు కొనసాగింపు?

By:  Tupaki Desk   |   22 May 2021 12:15 PM IST
రఘురామపై రాజద్రోహం కేసు కొనసాగింపు?
X
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే కొన్ని షరతులు పెట్టింది. ఆయనపై మోపిన రాజద్రోహం కేసు విచారణకు సహకరించాలని కండీషన్ పెట్టింది. అలాగే మీడియా, సోషల్ మీడియాలో మాట్లాడొద్దని షరతు విధించింది. సీఐడీ ఈ కేసులో విచారణ కొనసాగించవచ్చని చెప్పడం ఏపీ సర్కార్ కు కలిసి వచ్చింది.

సుప్రీం తీర్పుతో రాజద్రోహం కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఇప్పటికే నమోదు చేసిన రాజద్రోహం కేసులో మరిన్ని ఆధారాల సేకరణకు సిద్ధమవుతోంది. ఈ కేసులో సుప్రీంకోర్టు లేవనెత్తిన అంశాలు, రఘురామకు విధించిన షరతులు సీఐడీకి కీలకంగా మారాయి.

రఘురామపై ఏపీ సీఐడీ దాఖలు చేసిన రాజద్రోహం కేసు విచారణకు సుప్రీంకోర్టు తీర్పుతో ఏపీ సర్కార్ కు లైన్ క్లియర్అయ్యింది. సీఐడీ విచారణకు బ్రేక్ పడుతుందని భావించినా సుప్రీంకోర్టు మాత్రం కేసు విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఏపీ సీఐడీకి ఊరటనిచ్చింది. విచారణకు రఘురామను సహకరించాలని షరతు విధించింది. దీంతో రఘురామ ఇప్పుడు సీఐడీ విచారణను ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది.

ఈ క్రమంలోనే సీఐడీ దూకుడు పెంచింది. రఘురామపై మోపిన రాజద్రోహం అభియోగాలపై మరిన్ని ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతానికి రఘురామ వ్యాఖ్యలే ఆధారంగా ఫోన్ కాల్స్, ఇతర ఆధారాలు సేకరించి రఘురామకు ఉచ్చు బిగిసేలా చేసేందుకు ఏపీ సీఐడీ రంగం సిద్ధం చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.