Begin typing your search above and press return to search.

వివాదాస్పదం కానున్న ‘‘నవంబరు 9’’

By:  Tupaki Desk   |   9 May 2016 5:42 AM GMT
వివాదాస్పదం కానున్న ‘‘నవంబరు 9’’
X
కొన్ని అంశాల్ని వీలైనంతవరకూ స్టేటస్ కో మొయింటైన్ చేయటానికి మించిన మంచిపని మరొకటి ఉండదు. వివాదాస్పద అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో అందరి ఆమోదం పొందేలా చేయటం.. ఉద్రిక్తతలకు దూరంగా.. సరికొత్త తలనొప్పులకు కారణంగా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నట్లుగా రాజకీయపక్షాలే కాదు.. పలు సంస్థలు ఇదే తీరులో వ్యవహరిస్తున్న నేపథ్యంలో నిత్యం ఏదో ఒక ఉద్రిక్తత తెరపైకి వస్తున్న పరిస్థితి.

దేశంలో ఇప్పుడున్న సమస్యలు సరిపోవన్నట్లుగా దశాబ్దాల క్రితం దేశం మొత్తాన్ని ప్రభావితం చేసిన అయోధ్య రామజన్మభూమి అంశం మరోమారు తెర మీదకు వచ్చింది. అయోధ్యలో వివాదాస్పద మందిరాన్ని కూల్చివేయటం.. అక్కడ రామాలయాన్ని నిర్మించాలన్న డిమాండ్ పై జరిగిన రచ్చ ఎంతో తెలిసిందే. దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేపిన ఈ ఘటనకు సంబంధించి చేదు గురుతులు ఎన్నింటినో దేశం చూసింది. ఈ అంశంపై ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో అన్ని అంశాల్ని జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.

కానీ.. అందుకు భిన్నంగా సాధువులు.. పూజారుల సంఘం ఒకటి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో జరుగుతున్న సింహస్థ కుంభమేళా సందర్భంగా సమావేశమైన హిందుమత పెద్దలు రామమందిర నిర్మాణ కార్యక్రమానికి సంబంధించిన ముహుర్తాన్ని నిర్ణయించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం త్వరలో షురూ కానుందంటూ బీజేపీ నేతలు చెబుతున్న మాటలకు తగ్గట్లే తాజాగా హిందూ మతానికి చెందిన కొందరు పెద్దలు ఈ నవంబర్ 9ను రామాలయ నిర్మాణానికి ముహుర్తాన్ని నిర్ణయించారు.

అయోధ్య రామాలయ నిర్మాణం కోసం డేట్ డిసైడ్ చేసిన నేపథ్యంలో.. భవిష్యత్తు రాజకీయాలు ఈ డేట్ చుట్టూ తిరగటం ఖాయమని చెప్పక తప్పదు. ఇప్పుడు నిర్ణయించిన ఈ తేదీన రామాలయ నిర్మాణం జరుగుతుందా? లేదా? అన్న విషయాన్ని పక్కన పెడితే.. పెద్ద రాజకీయ రగడ మాత్రం చోటు చేసుకోవటం ఖాయమని చెప్పాలి. సున్నిత అంశాల్లో తొందరపాటు పనికిరాదన్న విషయాన్ని హిందూ మత పెద్దలు ఎందుకు మర్చిపోతున్నట్లు..?