Begin typing your search above and press return to search.

ఆ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే క‌న‌ప‌డ‌డం లేదట‌

By:  Tupaki Desk   |   31 July 2016 8:10 AM GMT
ఆ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే క‌న‌ప‌డ‌డం లేదట‌
X
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పై ఆ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు ఓ రేంజ్‌ లో ఫైర‌వుతున్నారు. ఇక‌, స్థానిక బీఎస్పీ నేత‌లైతే ఏకంగా తిమ్మాపూర్ పోలీసుల‌కు ఈయ‌న‌పై ఫిర్యాదు కూడా చేశారు. అస‌లింత‌కీ ఆయ‌నేం నేరం చేశారో. వారెందుకు అంత‌గా ఫైర‌య్యారో తెలుసుకుందాం. తెలంగాణ సాధ‌న కోసం జ‌రిగిన ప్ర‌జాపోరాటాలు అంద‌రికీ తెలిసిన‌వే. అదేసమయంలో తెలంగాణ కోసం సాహిత్య‌కారులు కూడా అంతేస్థాయిలో ప‌దం, పాదం క‌లిపి ప్ర‌జాకాంక్ష‌కు గ‌జ్జెక‌ట్టారు. తెలంగాణ సాధించుకున్నారు. ఇలాంటి సాహిత్య‌కారుల్లో ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ ప్ర‌ముఖుడు. ఈయ‌న స్థాపించిన సాహిత్య సంస్థ ర‌స‌మ‌యి.. ద్వారా అంద‌రికీ సుప‌రిచితులై.. దానినే ఇంటి పేరు చేసుకుని తెలంగాణ ఉద్య‌మంలో పేరు తెచ్చుకున్నారు.

ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్రోత్సాహంతో రాజ‌కీయ అరంగేట్రం చేశారు. క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని మాన‌కొండూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీకి పోటీచేసి అత్య‌ధిక మెజారిటీతో గెలుపొందారు. అదేస‌మ‌యంలో తెలంగాణ సాంస్కృతిక వారిధి చైర్మ‌న్‌ గా కూడా ఉన్నారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, ఆయ‌న ఇటీవ‌ల కొంత‌కాలంగా త‌న నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌ను అస్స‌లు ప‌ట్టించుకోవడంలేద‌ని అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్రంగా ఫైర్ అయిపోతున్నారు. ముఖ్యంగా ఇటీవల అమెరికాలో జరిగిన నాటా వేడుకలకు హాజరయిన రసమయి ఆ త‌ర్వాత అస్స‌లు నియోజ‌క‌వ‌ర్గం జోలికే రావ‌డం లేద‌ని వారు వాపోతున్నారు.

ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ.. నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌ను ఇలా క‌రేపాకులా చూడ‌డం స‌రికాద‌ని వారు అంటున్నారు. ఇంత‌లోనే ర‌స‌మ‌యికి వ్య‌తిరేకంగా బీఎస్పీ నేత‌లు అప్పుడే ప్ర‌చారం కూడా ప్రారంభించేశారు. అక్క‌డితో ఆగ‌కుండా బాల‌కిష‌న్ క‌నిపించ‌డం లేదంటూ.. తిమ్మాపూర్ పోలీసుల‌కు ఫిర్యాదు కూడా చేశారు. కొన్ని నెలలుగా అసలు నియోజకవర్గానికి రావడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంత‌రం బీఎస్పీ నేత‌లు మీడియాతో మాట్లాడుతూ.. త‌న‌పై ఎన్నో ఆశ‌లు పెట్టుకుని గెలిపించిన ప్ర‌జ‌ల‌ను ర‌స‌మ‌యి మోసం చేస్తున్నార‌ని వారు ధ్వ‌జ‌మెత్తారు. మ‌రి ఈ ఆరోప‌ణ‌లు, కేసుల‌పై ర‌స‌మ‌యి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

కొసమెరుపు ఏంటంటే... బాలకిషన్ కు కేసీఆర్ కుటుంబం నుంచి మంచి మద్దతు ఉంటుంది. అందుకే ఆయన నిర్లక్ష్యం నడుస్తుంది అని విమర్శలు కూడా వస్తున్నాయి.