Begin typing your search above and press return to search.

చిల్లర నాణేలు కానిస్టేబుల్ ప్రాణాల్ని కాపాడాయట

By:  Tupaki Desk   |   23 Dec 2019 4:39 AM GMT
చిల్లర నాణేలు కానిస్టేబుల్ ప్రాణాల్ని కాపాడాయట
X
పోయే ప్రాణాన్ని ఆపలేరంటారు. కానీ.. నూకలు ఉండాలే కానీ పోయే ప్రాణం సైతం పోదు. అనూహ్యంగా చోటు చేసుకునే పరిణామాల్ని చూస్తే ఈ మాటలో ఉన్న నిజం ఇట్టే అర్థమైపోతుంటుంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి యూపీలో చోటు చేసుకుంది. పౌరసత్వ సవరణ చట్టంతో దేశ వ్యాప్తంగా సాగుతున్న నిరసనలు.. ఆందోళనలు తెలిసిందే. దేశంలోని మరే రాష్ట్రంలో లేని రీతిలో ఉత్తరప్రదేశ్ లో నిరసనలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.

అదే సమయంలో సీఏఏకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనల్లో మరణిస్తున్న వారి సంఖ్యకు సంబంధించిన వార్తలు బయటకు వచ్చి ఆందోళనలకు గురి చేస్తున్నాయి. ఆందోళనల్ని అణిచివేసేందుకు యూపీ పోలీసులు అనుసరిస్తున్న వైనంపై విమర్శలు వెల్లువెత్తుతుంటే.. తమ తప్పేం లేదని.. ఆందోళనకారులకు.. సీఏఏకు అనుకూలంగా ఉన్న వారి మధ్య నడుస్తున్న లొల్లితోనే వాతావరణం అంతకంతకూ ఎక్కువ అవుతుందంటూ పోలీసు ఉన్నతాధికారులు చేస్తున్న వ్యాఖ్యలు కొత్త చర్చకు తెర తీస్తున్నాయి.

ఇలాంటివేళ అనూహ్యంగా చోటు చేసుకున్న ఒక ఘటన ఒక పోలీస్ కానిస్టేబుల్ ప్రాణాల్ని కాపాడింది. పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు.. ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే యూపీ.. కర్ణాటక.. అసోంలో ఎక్కువ హింస ఎక్కువగా సాగుతోంది. ఇదిలా ఉంటే ఆదివారం యూపీలోని ఫిరోజాబాద్ లో జరుగుతున్న ఆందోళనల్లో దూసుకొచ్చిన బుల్లెట్ ఒకటి కానిస్టేబుల్ విజేందర్ కుమార్ కు తాకింది. అనూహ్యంగా బుల్లెట్ దూసుకొచ్చి.. చొచ్చుకుపోయిన ప్లేస్ లో అతడి పర్సు ఉండటంతో బతికిపోయాడు.

పర్సులో కొన్ని చిల్లర నాణేలు.. ఏటీఎం కార్డులు.. శివుని ఫోటో ఉన్నట్లుగా అతడు చెబుతున్నారు. వేగంగా దూసుకొచ్చిన బుల్లెట్ పర్సును తాకి.. అందులోని వస్తువుల కారణంగా ఒంట్లోకి దిగకుండా అడ్డుకుంది. ఆందోళనకారులు జరిపిన కాల్పుల కారణంగానే బుల్లెట్ దూసుకొచ్చిందని కానిస్టేబుల్ చెబుతున్నారు. ఏమైనా బుల్లెట్ దూసుకొచ్చినా బతికిపోయిన విజేందర్ వైనం ఇప్పుడు విస్మయానికి గురి చేస్తోంది.