Begin typing your search above and press return to search.

ఏబీ అరెస్ట్ దిశగా పరిణామాలు?

By:  Tupaki Desk   |   5 Jan 2021 5:33 PM IST
ఏబీ అరెస్ట్ దిశగా పరిణామాలు?
X
చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసి అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను, వైసీపీని ఇబ్బందులు పెట్టారని ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈయనపై అప్పట్లో ఈసీకి వైసీపీ ఫిర్యాదు కూడా చేసి బాధ్యతల నుంచి తప్పించేలా చేసింది.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏబీ వెంకటేశ్వరరావుకు కష్టాలు మొదలయ్యాయి. చంద్రబాబు హయాంలో జరిపిన భద్రతా పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో అక్రమాలకు సంబంధించి మాజీ ఇంటిలిజెన్స్‌ ఛీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు అరెస్టు తప్పేలా లేదు. ఈ వ్యవహారంలో తొలుత అభియోగాల నమోదు చేయకుండానే ఆయన్ను సస్పెండ్‌ చేసిన జగన్ సర్కార్‌.. కోర్టు అభ్యంతరాలతో తాజాగా ఆ ప్రక్రియను పూర్తి చేసింది. అయినా ఇప్పటికీ ఆయనకు పోస్టింగ్‌, జీతం ఇవ్వకుండా వేధిస్తోంది.

భద్రతా పరికరాల స్కాం పక్కా ఆధారాలు సేకరించిన జగన్ సర్కార్.. ఈ కేసులో ఏబీని అరెస్టు చేసేందుకు కూడా పావులు కదుపుతోంది. దీంతో ఆయన ప్రభుత్వం అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును, తనను వేధిస్తోందంటూ ఐపీఎస్ అధికారుల సంఘాన్ని ఆశ్రయించారు.

ఈ కేసులో తనను అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులో తనను ఇరికించిందని, తాను చేయని తప్పులకు బలి చేయాలని చూస్తోందని, అందుకే తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన హైకోర్టును కోరారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హైకోర్టులో ఊరట లభించకపోతే సుప్రీంను ఆశ్రయించేందుకు ఏబీ సిద్దమవుతున్నారు.

ఇక ఇప్పటికే ఏబీ వెంకటేశ్వరరావు తనను జగన్ ప్రభుత్వం వేధిస్తోందంటూ ఐపీఎస్ అధికారుల సంఘానికి లేఖ రాశారు. త్వరలో క్రిమినల్ కేసుపెట్టి జ్యూడిషియల్ రిమాండ్‌కు పంపి.. మళ్లీ సస్పెన్షన్ విధించాలని కుట్ర ప్రభుత్వం పన్నుతోందంటూ ఆయన ఈ లేఖలో ఆరోపించారు