Begin typing your search above and press return to search.

ఆప్ మీద అవినీతి బురద... టైమింగ్ చూసి మరీ...

By:  Tupaki Desk   |   1 Nov 2022 4:30 PM GMT
ఆప్ మీద అవినీతి  బురద...  టైమింగ్ చూసి మరీ...
X
ఆమ్ ఆద్మీ పార్టీ చిన్నగా మొదలై ఈ రోజు ప్రపంచంలోనే అతి పెద్ద సభ్యత్వం కలిగిన జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న బీజేపీకే వణుకు పుట్టిస్తోంది. గుజరాత్ అంటేనే బీజేపీకి పుట్టినిల్లు లాంటిది. అక్కడ మూడు పదులు ఏళ్ళుగా బీజేపీ వరసబెట్టి గెలుస్తూ వస్తోంది. అలాంటి చోట ఆప్ జెండా పాతేందుకు రెడీ అయింది. అసలే గుజరాత్ లో రాజకీయంగా ఇబ్బందులు ఉన్నాయానుకుంటే తీగల వంతెన కూలి వందలాది మంది మృత్యువాత పడ్డారు. దాంతో అధికార బీజేపీకి సంకట పరిస్థితి ఎదురవుతోంది.

దాంతో మీడియా మొత్తం ఫోకస్ ఆ వైపు ఉండగానే ఇపుడు ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్లుగా ఆప్ మీద బురద జల్లుడు మొదలైంది అని ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ అంటున్నారు. విషయానికి వస్తే ఆప్ పార్టీకి యాభై కోట్ల దాకా సొమ్ములు ఇవ్వడానికి తాను సిద్ధపడి అందులో నుంచి తొలి విడతగా పది కోట్లను ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ కి ఇచ్చినట్లుగా ఆర్ధిక నేరగాడు ప్రస్తుతం జైలులో కటకటాలు లెక్కిస్తున్న సుకేశ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు.

ఆయన తాజాగా చేసిన ఈ ఆరోపణలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంతకీ ఈ ఆర్ధిక నేరగాడు ఏమంటున్నారు అంటే సత్యేంద్ర జైన్ కి పది కోట్లు దఫదఫాలుగా చెల్లించానని, అదే విధంగా చూస్తే ఆప్ తనకు దక్షిణాదిన కీలకమైన పదవి ఇస్తుందన్న ఆశతో ఆ పార్టీకి యాభై కోట్ల దాకా నిధులను ఇచ్చేందుకు కూడా అంగీకరించాను అని.

ఇక చూస్తే రెండు వందల కోట్ల కేసులో సుకేశ్ చంద్రశేఖర్ పోలీసులకు చిక్కి ఇపుడు జైల్లో ఉన్నాడు. ఆయన జైలులో ఉన్నపుడు రెండు సార్లు ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ వచ్చి తనను కలిశారని, జైలులో తనకు సౌకర్యాలు కల్పిస్తాను అన్న వంకతో పది కోట్ల దాకా తీసుకున్నారని, అలాగే జైళ్ల డీజీకి ఇవ్వాలంటూ మరో పన్నెండు కోట్లు తన నుంచి వసూల్ చేసారని అంటున్నారు.

ఆయన అసలే ఆర్ధిక నేరగాడు, ఆయన నుంచి ఈ ఆరోపణలు అంటే ఆసక్తిగానే ఉన్నా ఆలోచించాల్సిందే అన్న మాట కూడా వినిపిస్తోంది. మరో వైపు చూస్తే ఆయన ఆరోపణల మీద అపుడే ఈడీ రంగంలోకి దిగుతోంది, దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయిస్తామని చెబుతోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసిన ఆప్ అధినేత కేజ్రీవాల్ మాత్రం గుజాత్ లో వంతెన కూలి జనాలు చనిపోయారని, దాని నుంచి ప్రజల దృష్టిని మార్చడానికే తమ పైన ఇలాంటి ఆరోపణలు అని మండిపడ్డారు.

మొత్తానికి చూస్తే ఆప్ మీద పడినది నిందా నిజమా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా దేశంలో బీజేపీకి ధీటుగా ఆప్ ఎదుగుతోంది. మరి ఆ ఎదుగుతున్న క్రమంలో ఆ పార్టీ మీద ఇలాంటి విమర్శలు ఆరోపణలు కూడా రావడం సహజం, మరి నిగ్గు తేల్చితే ఆప్ కే లాభం కదా. చూడాలి మరి ఏం జరుగుతుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.