Begin typing your search above and press return to search.

2019లో అధికార మార్పిడి ప‌క్కాన‌ట‌

By:  Tupaki Desk   |   9 Dec 2016 10:07 AM GMT
2019లో అధికార మార్పిడి ప‌క్కాన‌ట‌
X
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సార‌థ్యంలోని తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్ప‌డి రెండేళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా స‌ర్కారు త‌ర‌ఫున మంత్రి కేటీఆర్ మీడియాతో ముచ్చ‌టించిన సంగ‌తి తెలిసిందే. దీనికి కౌంట‌ర్ గా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ సైతం అదే తీరును ఫాలో అయింది. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ...ప్రజల ఆకాంక్షలమేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన త‌మ పార్టీ 2019 ఎన్నికల్లో తప్పకుండా అధికారంలోకి వస్తోందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ గ‌ద్దెనెక్కిన త‌ర్వాత పీపుల్స్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలకు ప్రాముఖ్యతనిస్తూ.. పాలకుల ప్రయోజనాలకు చివరి ప్రాధాన్యత ఇస్తామని ప్ర‌క‌టించారు.

టీఆర్ఎస్‌ ప్రభుత్వ పని తీరు అప్రజాస్వామ్యయుతంగా ఉంద‌ని భ‌ట్టి మండిప‌డ్డారు. ప్రజల అవసరాల కంటే పాలకుల అవసరాలకే ప్రాముఖ్యత ఇస్తున్నారని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయాలన్న సోయి సీఎంకు లేదని, ఇచ్చిన హామీలను ఈ ఐదేండ్లలో నెరవేరుస్తామని చెప్పలేదని అసెంబీల్లో సీఎం చెప్పడం సిగ్గుచేటని అన్నారు. జలయజ్ఞంలో వేల కోట్ల అవినీతి జరిగిందని, అందుకే ప్రాజెక్టులు పూర్తి కాలేదని టీఆర్‌ఎస్‌ ఆరోపించడాన్ని భ‌ట్టి ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్నందున ప్రభుత్వానికి సర్వ అధికారాలు ఉన్నాయని గుర్తుచేస్తూ... జలయజ్ఞంలో అవినీతి జరిగిందన్న ఆధారాలు సీఎం వద్ద ఉంటే వారిపై చర్యలు తీసుకోవచ్చున‌ని స‌వాల్ విసిరారు. "జలయజ్ఞం ప్రాజెక్టులను ఈపీసీ ద్వారా టెండర్లు ఇస్తారు. కాంట్రాక్టు అగ్రిమెంట్‌ పత్రాలు ఉంటాయి. కాంట్రాక్టర్లు బ్యాంకులకు గ్యారంటీ ఇస్తారు. ఇవన్నీ ప్రభుత్వానికి ఆధారాలు. సమగ్రంగా విచారణ జరపవచ్చు. విచారణ జరిపి డబ్బులు రికవరీ చేయించాలి. చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అధికారం సీఎంకు ఉంది. ఎందుకు తీసుకోవడం లేదు. కనీసం ఆ కాంట్రాక్టులను రద్దు కూడా చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉన్నది. ఆ కాంట్రాక్టర్లతో ప్రభుత్వం లాలూచీ పడింది కాబట్టే, బెదిరింపులు, మాటలకు ముఖ్యమంత్రి పరిమితమయ్యారు" అంటూ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌లో ఇప్పటికీ కొనసాగుతున్న అనైక్యతే మళ్లీ టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తుందన్న భావనలో నిజం లేద‌ని భ‌ట్టి అన్నారు. "కాంగ్రెస్‌ నాయకత్వం రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయిలో ఐక్యతతో ముందుకు పోతోంది. మా పార్టీ నేతలకు ముఖ్యమంత్రి స్థాయి అనుభవం ఉండటం శుభపరిణామం. ఆ రూపంలోనే మేం చూస్తాం. సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారన్న నెగెటివ్‌ ఆలోచన మాకు లేదు. వారికి పరిపాలన అవగాహన ఉన్నందుకు సంతోషంగా ఉంది. కేసీఆర్‌కు పరిపాలన అనుభవం, ఆర్థిక క్రమశిక్షణ లేదు. మిగులు బడ్జెట్‌లో ఉన్నా లోటు బడ్జెట్‌ను సృష్టించారు. ఆడంబరాలకు కోసం ప్రజల జీవితాలను పణంగా పెడుతున్నారు. సీఎంకు విజన్‌ లేకపోవడంతో రెండున్నరేళ్లలో 60వేలకోట్ల నుంచి 70వేల కోట్ల రూపాయల అప్పు చేశారు"అంటూ భట్టి మండిపడ్డారు.త‌మ పార్టీ చేప‌ట్టిన విద్యార్థి గర్జన సక్సెస్‌ అయిందని, రైతురుణమాఫీ చేయాలని ఉద్యమం చేస్తుండ‌టంలో భాగంగా ప్రతి రైతు నుంచి సంతకాలు సేకరిస్తున్నామ‌ని తెలిపారు. సామాజిక తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రజలకు చెప్పి మోసం చేసిన టీఆర్‌ఎస్‌ అసలు స్వరూపాన్ని బయటపెడతామ‌ని భ‌ట్టి ప్ర‌క‌టించారు. వాస్తవాలను మాట్లాడుతున్నందుకే కోదండరామ్‌ను కాంగ్రెస్‌ ఏజెంట్‌ అంటున్నారని ఆయ‌న విమ‌ర్శించారు. సర్కారుపై కోదండరామ్‌ మాట్లాడే విషయంలో ఆలస్యం కావడం కూడా ఇటువంటి పరిస్థితికి కారణం కావచ్చున‌ని విశ్లేషించారు. తెలంగాణ ప్రజలు తప్పు చేసిన వారిని ప్రశ్నించే మనస్తతత్వం కలిగిన వారు అయిన‌ప్ప‌టికీ పోరాడి పోరాడి అలిసిపోయి సేదతీరుతున్నారనే భ్రమలో కేసీఆర్‌ ఉన్నారని భ‌ట్టి అన్నారు. సమయం కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ప్రశ్నించే విధానం పెరుగుతుందని, అది ఉప్పేనలా మారుతుంద‌ని జోస్యం చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో బాంచన్‌ నీ దొర అనే విష సంస్కృతిని తిరిగి మాత్రమే పునర్నిర్మాణం చేస్తున్నారని, ఇదే ఈ ప్రభుత్వానికి పెను ప్రమాదంగా మారునుందని వ్యాఖ్యానించారు.