Begin typing your search above and press return to search.

టీకాంగ్రెస్.. చేతులు కాలాకా ఆకులు

By:  Tupaki Desk   |   27 Aug 2019 1:45 PM IST
టీకాంగ్రెస్.. చేతులు కాలాకా ఆకులు
X
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిదో గ్రూపు.. ఇక ఎప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న రేవంత్ రెడ్డిది మరో గ్రూపు.. వీరిద్దరికి విభిన్నంగా సాగే భట్టి , కొందరి నేతలదీ మరో బాట.. ఇక సీనియర్లు అయిన వీహెచ్, మరికొందరి అగ్రెసివ్ ఆట.. వీరేకాదు.. కాంగ్రెస్ లోనే ఉంటూ కాంగ్రెస్ విధానాలనే తప్పుపట్టే కోమటిరెడ్డి బ్రదర్స్ దీ విలక్షణమైన గ్రూపు.. ఇలా గ్రూపుల కొట్లాటతో కాలం వెళ్లదీసే కాంగ్రెస్ నేతలను ప్రాణహిత కలిపింది..

కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించారు.. శరవేగంగా నడిపించారు.. ఇటీవలే ప్రారంభించారు. నీళ్లు కూడా ఎత్తిపోస్తున్నారు. ఇప్పుడు ప్రాణహిత నది నీళ్లను ఒడిసిపడుతున్నారు. అయితే ఇదే ప్రాణహిత పుట్టే ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టాలంటూ టీకాంగ్రెస్ నేతలు తాజాగా పోరుబాట పట్టారు. ఉత్తమ్- రేవంత్- కోమిటిరెడ్డి- భట్టి - వీహెచ్ సహా అందరూ ఒకే వేదికపైకి వచ్చి ఐక్యతతో దీనిపై పోరాటానికి తుమ్మిడిహెట్టి వద్దకు రావడం చూసి కాంగ్రెస్ కార్యకర్తల కళ్లు చల్లబడ్డాయి. ఇలానే ముందుకు సాగితే ఎంత బావుండు అని ఆనందపడ్డారు.

అయితే చాలా లేట్ అయిపోయింది. ఇదేదో కాళేశ్వరం కట్టకముందు కాంగ్రెస్ నేతలు ఇలా ఐక్యతతో పోరాడితే ఏదైనా ప్రయోజనం ఉండేది. ఇప్పుడు నిండా మునిగాక.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా టీకాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తుండడం గమనార్హం. ఏదీఏమైనా ఇప్పటికైనా అన్ని గ్రూపులు పక్కనపెట్టి టీకాంగ్రెస్ నేతలు కలవడం విశేషం.

తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతూ అధికార టీఆర్ ఎస్ ను కలవరపెడుతోంది. కాంగ్రెస్ నేతలు సైతం బీజేపీ బాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో అందరూ నేతలు ఇలా ఐక్యతతో తుమ్మిడిహెట్టికి రావడం చూసి కాంగ్రెస్ లో కొంత జోష్ వచ్చేసింది.