Begin typing your search above and press return to search.

కూకట్‌ పల్లిలో కుమ్ములాట...

By:  Tupaki Desk   |   31 July 2018 10:52 AM IST
కూకట్‌ పల్లిలో కుమ్ములాట...
X
కూకట‌్‌ పల్లి. తెలుగు రాష్ట్రాలు విడిపోకముందు నుంచీ ఈ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనికి కారణం అక్కడ కోస్తాంధ్రకు చెందిన వారు ఎక్కువగా ఉండడం. అంతే కాదు... క్రష్ణా - గుంటూరు జిల్లాలకు చెందిన ఓ పెద్ద కులం వారు అక్కడే చాలా కాలంగా నివసిస్తూండడం. దీంతో సాధారణంగానే కూకట‌్‌ పల్లి నియోజకవర్గం వైపు అన్ని రాజకీయ పార్టీలపై చూపు ఉంటుంది. ఇక్కడ ఇంతకు ముందు విజయం సాధించిన వారంతా ఆ అగ్రకులానికి చెందిన వారే కావడం గమనార్హం. ఇక్కడి నుంచి 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన మాధవరం క్రష్ణారావు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధి గొట్టిముక్కల పద్మారావుని ఓడించారు. తెలంగాణ రాష్ట్రమంతటా తెలంగాణ రాష్ట్ర సమితి గాలి బలంగా వీచి ఆ పార్టీ అభ్యర్ధులు విజయం సాధించినా... కూకట్‌ పల్లిలో మాత్రం తెలుగుదేశం అభ్యర్ధి మాధవరం క్రష్ణారావు విజయం సాధించారంటే ఆ నియోజకవర్గంలో ఆ కులం ప్రాధాన్యం ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. విజయం సాధించిన కొన్నాళ్ల వరకూ ఆ పార్టీలోనే ఉన్న మాధవరం కొన్నాళ్ల తర్వాత కారెక్కేశారు. ఈ హఠాత్ పరిణామాన్ని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ఊహించలేదు. దీంతో అంత వరకూ తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉన్న కూకట్‌ పల్లి కాస్త గులాబీ పరమైంది.

ఇప్పుడు మళ్లీ ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. మరో ఏడెనిమిది నెలల్లో ఈ హడావుడి మరింత పెరగనుంది. దీంతో ఇక్కడ ఎన్నికల కాక ప్రారంభమైంది. ఈ సారి కూకట్‌ పల్లి నుంచి ఎవరు పోటీ చేస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. వచ్చే ఎన్నికల్లో గొట్టిముక్కల పోటీ చేస్తారా...? లేక మాధవరం పోటీ చేస్తారా అనేది తెలంగాణ రాష్ట్ర సమితిలో చర్చనీయాంశం అయ్యింది. ఎమ్మెల్యేల పనితీరుపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేయించి ఎవరు ఎలా పని చేస్తున్నారు... ఎవరికి టిక్కట్ ఇస్తే విజయం సాధిస్తాం వంటి అంశాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పరిశీలిస్తున్నారు. దీంతో ఈ ఇద్దరు నాయకుల్లో టిఆర్ ఎస్ టిక్కట్ ఎవరిని వరిస్తుందనేది హాట్ టాపిక్‌ గా మారింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ హామీ ఇవ్వడంతో కూకట్‌ పల్లిలో ఉన్న సెటిలర్లు ఈసారి కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశాలున్నాయంటున్నారు. ఇక్కడి ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలో సెటిల్ అయిన ఆంధ్రులకు కూడా కాంగ్రెస్ టిక్కట్లు ఇస్తామని ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదాపై టిఆర్ ఎస్ మాట మార్చడంతో అది తమకు కలిసి వస్తుందన్నది కాంగ్రెస్ నాయకులు యోచన. మరోవైపు ఇంతకు ముందున్న తమ పట్టును తిరిగి సంపాదించుకోవాలని తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డిని రంగంలోకి దించాలనుకుంటోంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో నేరుగా పొత్తు కాని, లోపాయికారీ పొత్తుకాని పెట్టుకున్నా కూకట్‌ పల్లి కోటను కొట్టేయాలన్నది తెలుగు తమ్ముళ్ల ఆశ. చూడాలి ఎవరి ఆశలు ఫలిస్తాయో... ఎవరి వ్యూహాలకు ఓటర్లు పడతారో..... !?