Begin typing your search above and press return to search.

అవిశ్వాస‌మే విప‌క్షం త‌ర్వాతి స్కెచ్

By:  Tupaki Desk   |   18 Dec 2016 1:12 PM IST
అవిశ్వాస‌మే విప‌క్షం త‌ర్వాతి స్కెచ్
X
తెలంగాణ‌లో అధికార టీఆర్ ఎస్ పార్టీ తీరుపై ప్ర‌ధానప్ర‌తిప‌క్ష‌మైన‌ కాంగ్రెస్ పార్టీ ర‌గిలిపోతోంది. పెద్ద నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో కేంద్రంలోని బీజేపీకి పూర్తి మ‌ద్ద‌తు ఇచ్చేలా మాట్లాడుతుండ‌టం ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక‌పోతున్న సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో త‌మ‌ను ఇర‌కాటంలో ప‌డేసేలా సొంత ఎజెండాతో అధికార పార్టీ ముందుకు సాగుతోంద‌ని కాంగ్రెస్ అనుమానం వ్య‌క్తం చేస్తోంది. అసెంబ్లీ శీతాకాల స‌మావేశాల రెండో రోజు తాము నిబంధ‌న‌ల ప్ర‌కారం జంప్ జిలానీల‌పై చ‌ర్య తీసుకోమ‌ని కోరితే స‌స్పెండ్ చేయ‌డం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని కాంగ్రెస్ నాయ‌కులు వాపోతున్నారు. ఇలా త‌మ‌ను ఇబ్బందుల‌ను పాలు చేసిన టీఆర్ ఎస్ ప్రభుత్వ పాలనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై పార్టీ నేత‌లు కొంద‌రు చర్చిస్తున్నట్టు తెలిసింది.

ఇటు ప‌రిపాల‌న‌లో విఫ‌ల‌మై అటు ప్ర‌జాస్వామ్య విధానాల‌ను తుంగ‌లో తొక్కుతున్న టీఆర్ ఎస్ కు గ‌ట్టి ఝ‌ల‌క్ ఇవ్వాలంటే అవిశ్వాస‌మే స‌రైన‌దని కాంగ్రెస్ లోని కొంద‌రు ఎమ్మెల్యేలు బ‌లంగా భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ప్రస్తుతం అసెంబ్లీలో 120 మంది సభ్యులుంటే, అందులో 85 మంది వరకు టీఆర్‌ఎస్‌పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినప్పుడు, దానికి మద్దతు తెలపడానికి పదిమంది సభ్యులు లేచి నిలబడితే చాలు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో 24 మంది ఎమ్మెల్యేలతో అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానం ఇవ్వడం వల్ల రెండు - మూడు ప్రయోజనాలు ఉన్నాయని కాంగ్రెస్‌ పార్టీ నేతలు తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సమాచారం ఇవ్వాలని సుప్రీంకోర్టు అసెంబ్లీని కోరింది. దానికి ఆరునెలలు గడువు కూడా ఇచ్చింది. త్వరలోనే ఆ గడువు ముగియనుంది. స్పీకర్‌ సుప్రీంకోర్టు సమాచారాన్ని అందజేయాల్సి ఉంది. అవిశ్వాస తీర్మానం ఇస్తే కాంగ్రెస్‌ పార్టీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేయనుంది. విప్‌ ను ధిక్కరించకుండా ప్రతి ఒక్కరూ సభకు హాజరుకావల్సి ఉంది. గైర్హాజర్‌ అయినా, అనుకూలంగా మద్దతు తెలపకపోయినా అలాంటి వారిపై వేటు వేయాలని కాంగ్రెస్‌ పార్టీ గట్టిగా కోరే అవకాశం ఉంది. దీని ఆధారంగా అధికారపార్టీని ఇబ్బందుల్లో పెట్టవచ్చు అన్నది ప్రతిపక్షపార్టీ ఆలోచనగా ఉంది. త‌ద్వారా త‌మ‌ను ఏ కోణంలో అయితే ఇర‌కాటంలో ప‌డేశారో అదే అంశంతో టీఆర్ ఎస్‌ ను ఉక్కిరిబిక్కిరి చేయ‌వ‌చ్చ‌ని స‌ద‌రు ఎమ్మెల్యేలు వాదిస్తున్నారు.

అదే స‌మ‌యంలో తీర్మానం ప్రవేశపెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వ పాలనపై మాట్లాడేందుకు కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కువ సమయం ద‌క్కుతుంద‌ని విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో అధికారపార్టీ నేతలు అడ్డుతగిలే అవకాశం కూడ ఉండదు. ఈ రకంగా ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు అవిశ్వాస తీర్మానాన్ని వాడుకోవచ్చు అని ఆ నేతలు చెప్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానానికి మిగతా ప్రతిపక్షపార్టీలు మద్దతు తెలిపే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తంగా అధికార పార్టీ జోరుకు బ్రేకులు వేసేందుకు, స్వీయ‌రక్ష‌ణ‌లో ప‌డేసేందుకు అవిశ్వాస‌మే స‌రైన‌ద‌ని కొంద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేల బ‌ల‌మైన వాద‌న‌. దీనికి పెద్ద‌లు ఏమంటారో వేచి చూడాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/