Begin typing your search above and press return to search.

ద‌క్షిణాది నేత‌లే కాంగ్రెస్ టార్గెట్ ?

By:  Tupaki Desk   |   21 Aug 2021 1:04 PM IST
ద‌క్షిణాది నేత‌లే కాంగ్రెస్ టార్గెట్ ?
X
గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో పార్టీ కార్య‌క‌లాపాల‌కు కాస్త దూరంగా గ‌డిపిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తిరిగి ఆక్టివ్ అయ్యారు. ఆరోగ్యం కుదుట‌ప‌డ‌డంతో పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ప్ర‌ధాని మోడీని గ‌ద్దె దించ‌డం కోసం దేశంలోని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీల‌తో క‌లిసి కార్య‌చ‌ర‌ణ రూపొందించే ప్ర‌య‌త్నాల్లో ఉన్న ఆమె.. మ‌రోవైపు సొంత పార్టీని చ‌క్క‌పెట్టుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. కాంగ్రెస్‌లో భారీ మార్పుల‌తో తిరిగి పార్టీకి కొత్త ఉత్తేజం నింపేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ స‌మ‌యంలో పార్టీలోని కొంత‌మంది నేత‌ల అసంతృప్తి ఆమెకు ఇబ్బందిగా మార‌నుంది. పార్టీలోని కీల‌క ప‌ద‌వులు అప్ప‌జెప్పే విష‌యంలో ద‌క్షిణాది నేత‌ల‌వైపే కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారిస్తుంద‌ని త‌మ‌కు అన్యాయం చేస్తుంద‌ని ఉత్త‌ర‌, ప‌శ్చిమ భార‌త నాయ‌కులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న‌ట్లు స‌మాచారం.

ప‌ద‌వుల్లో త‌మ‌కు త‌గిన ప్రాధాన్య‌త ద‌క్క‌డం లేద‌ని నార్త్‌, వెస్ట్ ఇండియా కాంగ్రెస్ నాయ‌కులు గుర్రుగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల రాజ్య‌స‌భ‌లో పార్టీ విప్‌గా క‌ర్ణాట‌క‌కు చెందిన న‌సీర్ హుస్సేన్‌ను నియ‌మంచిడంపై కొంద‌రు నాయ‌కులు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే అదే రాష్ట్రానికి చెందిన మ‌ల్లికార్జున ఖ‌ర్గే రాజ్య‌స‌భ‌లో పార్టీ నేత‌గా, జైరాం ర‌మేష్ ఉప‌నేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో మ‌ళ్లీ అదే రాష్ట్రానికి చెందిన న‌సీర్ హుస్సేన్‌కు ప‌దవి క‌ట్ట‌బెట్ట‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక లోక‌స‌భ విష‌యానికి వ‌స్తే పార్టీ నేత‌గా అధీర్ రంజ‌న్ చౌద‌రి (ప‌శ్చిమ బెంగాల్‌) ఉన్నారు. ఉప‌నేత‌గా అస్సాం నాయ‌కుడు గౌర‌వ్ గొగొయి, చీఫ్ విప్‌గా సురేశ్ (కేర‌ళ‌), విప్‌గా మాణికం ఠాగూర్ (త‌మిళ‌నాడు) ఉన్నారు. పార్టీలో కీల‌క‌మైన సంస్థాగ‌త వ్య‌వ‌హారాల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కె.సి.వేణుగోపాల్‌, ప్రధాన స‌ల‌హాదారుగా పి.చిదంబ‌రం (త‌మిళ‌నాడు) కొన‌సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో కీల‌క ప‌దవులన్నీ ద‌క్షిణ భార‌త నాయ‌కుల‌కే క‌ట్ట‌బెడుతున్నారంటూ కొంత‌మంది ఇత‌ర ప్రాంతాల నేత‌లు పెద‌వి విరుస్తున్నారు.

ఇప్ప‌టికే నాయ‌క‌త్వ లేమితో స‌త‌మ‌వుతున్న కాంగ్రెస్ను తిరిగి దారిలోకి తెచ్చేందుకు సోనియా ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప్ర‌య‌త్నాలు మొద‌లెడుతున్నారు. ఆ పార్టీకి ఇప్ప‌ట్లో కొత్త అధ్య‌క్షుల‌ను ఎన్నుకునే సూచ‌న‌లు క‌నిపించ‌లేక‌పోయిన‌ప్ప‌టికీ తాత్కాలిక అధ్య‌క్షురాలిగానే ఉన్న సోనియా తిరిగి క్రీయాశీల‌క‌మ‌య్యారు. ఈ ప‌రిస్థితుల్లో సొంత పార్టీ నాయ‌కుల నుంచే అసంతృప్తి రావ‌డం ఇబ్బంది క‌లిగించే విష‌య‌మే. మ‌రి ఈ స‌మ‌స్య‌ను సోనియా ఎలా ప‌రిష్క‌రిస్తుందో చూడాలి.