Begin typing your search above and press return to search.

భార్యకు మాటిచ్చిన సీనియర్ నేత.. వార్తల్లో కనిపించకుండా పోయాడు!

By:  Tupaki Desk   |   28 April 2021 6:32 AM GMT
భార్యకు మాటిచ్చిన సీనియర్ నేత.. వార్తల్లో కనిపించకుండా పోయాడు!
X
నేతల నోటి మాటలు నీటి మూటలుగా పలువురు అభవర్ణిస్తుంటారు. మాట ఇస్తే అంతే.. ఏం జరిగినా.. దాని నుంచి పక్కకు జరగటానికి ససేమిరా అనే నేతలు రాజకీయాల్లో ఉంటారా? అన్న సందేహం కలుగుతుంది. కానీ.. చాలామంది ఉంటారు. సంచలన కథనాలే తప్పించి.. ఇలాంటి నేతల గురించి ప్రత్యేకంగా రాసే ఓపికా.. తీరికా మీడియా సంస్థల్లో పని చేసే వారికి ఉండదు. ఒకవేళ.. రాసినా.. ఇందులో ‘తాజా’ ఏముందన్న మాటతో బుట్టదాఖలయ్యే పరిస్థితి.

కరోనాతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన తెలంగాణ రాష్ట్ర సీనియర్ నేత.. తెలంగాణ అంటే ప్రత్యేక అభిమానం ఉన్న నేతగా గుర్తింపు పొందారు ఎం. సత్యనారాయణ రావు. ముక్కుసూటిగా వ్యవహరించే ఆయన.. ప్రశ్న ఏదైనా.. తనకు తెలిసినంత వరకు నిజం చెబుతారే కానీ.. అబద్ధం చెప్పటం ఆయనకు అలవాటు లేదు. ఈ కారణంతోనే.. ఎవరైనా రిపోర్టర్ కలిసి.. ఏదైనా అడిగితే.. వదిలేయండని అంటారే కానీ.. అబద్ధం మాత్రం చెప్పారు.

తప్పదు సార్.. మీరు చెప్పాల్సిందేనని పట్టుబడితే.. అయిష్ఠంగా అయినా సరే నిజం చెప్పే అతి గొప్ప లక్షణం ఆయన సొంతం. ఆయన మరణం నేపథ్యంలో ఆయన గురించి ఎవరైనా ప్రత్యేకంగా ఏదైనా రాస్తారా? అని చూస్తే.. పెద్దగా కవర్ చేసినోళ్లు లేరు. ఎమ్మెస్సార్ మాట్లాడితే సంచలనంగా ఉన్న సమయంలో.. తన నోటిని తానే బంద్ చేసుకోవటమే కాదు.. రాజకీయాల నుంచి కనుమరుగైన నేతగా ఆయన్ను చెప్పాలి. ఆయనకు భార్య.. ఇద్దరు కుమారులు.. ఇద్దరు కుమార్తెలు. ఆయన నోటి నుంచి వచ్చే వ్యాఖ్యలు పెను సంచలనంగా మారి.. పెద్ద వివాదాలకు కారణమయ్యేది.

కానీ.. ఆయన అందుకు తగ్గేవారు కాదు. ఇలాంటివేళలో.. ఈ సంచలనాలు.. గొడవలు ఎందుకు? నాకు మాట ఇవ్వండి.. మీరు మీడియాతో మాట్లాడకూడదు? అంటూ ఆయన సతీమణి మాట తీసుకున్నారు. భార్యకు మాట ఇచ్చిన తర్వాత నుంచి ఆయన నోటికి మౌనం అనే ప్లాస్టర్ వేసుకున్నారు. ఎవరెంత అడిగినా.. భార్యకు మాట ఇస్తానయ్యా.. నేనుమాట్లాడలేను.. ఇబ్బంది పెట్టొద్దనే వారే తప్పించి.. మాట్లాడటానికిఅస్సలు ఇష్టపడేవారు కాదు. ఇదే.. సంచలన నేత స్థాయి నుంచి రాజకీయాల్లో ఆయన పేరే వినపడని విధంగా మారింది. ఒక రకంగా రాజకీయాల నుంచి కనుమరుగు అయ్యే పరిస్థితిని తనకు తానుగా తెచ్చుకున్నారని చెప్పక తప్పదు. ఇవాల్టి రాజకీయాల్లో ఇలాంటి విశిష్ఠ గుణాలు ఉన్న నేతలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారో చెప్పండి?